ఎన్నారై ఉదంతంపై మంత్రిత్వశాఖ సీరియస్
హైదరాబాద్: హైదరాబాద్‌లో ఎన్నారై మహిళకు ఎదురైన చేదు అనుభవంపై కేంద్ర మహిళా శిశుశాఖా మంత్రిత్వ శాఖ సీరియస్‌గా తీసుకుంది. ఈవ్యవహారంపై కేంద్ర మహిళా శిశుశాఖా మంత్రి మేనకా గాంధీ సోషల్‌మీడియాలో స్పందించారు. కేవలం సింగిల్ మహిళ అయిన కారణంగా హోటల్ లోకి ఎంట్రీ తిరస్కరించడం తీవ్రమైన విషయమని కేంద్ర మంత్రి ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. ఇది ఆందోళన కలిగించే విషయమన్నారు. ఇలాంటి వివక్షాపూరిత విధానంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక నివేదిక కోరినట్టు ట్వీట్ చేశారు.
కాగా సింగిల్ విమెన్ అన్నకారణంతో హైదరాబాద్ నగరాన్ని సందర్శించేందుకు వచ్చిన ఎన్నారై నుపుర్ సారస్వత్‌కు ఎర్రగడ్డలోని హోటల్ దక్కన్ ప్రవేశాన్ని నిరాకరించింది. దీంతో తనకు ఎదురైన అవమానం పై సోషల్‌మీడియాలో వెల్లడించడంతో దుమారం రేగింది. నగరంలోని హోటళ్లు అనుసరిస్తున్న పాలసీపై తీవ్ర చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే.