మాజీ ఎంపీ చీరకు చెయ్యి తుడిచిన ఎమ్మెల్యే
మధ్యప్రదేశ్లో ఓ ఎమ్మెల్యే తనను ఎవరూ చూడట్లేదనుకుని మాజీ ఎంపీ చీర లాగారు. అయితే.. కెమెరా కళ్లకు మాత్రం ఆయన ఈ చేష్ట చేస్తూ దొరికిపోయారు. ఇదంతా ఓ బహిరంగ సమావేశంలో జరిగింది. దినేష్ రాయ్ అనే స్వతంత్ర ఎమ్మెల్యే సియోనిలో జరిగిన ఓ బహిరంగ సభలో బీజేపీ మాజీ ఎంపీ నీతా పటేరియా చీర మీద చెయ్యేశారు. అయితే ఆమె దాన్ని చూడనట్లుగా, పట్టించుకోకుండా వదిలేశారు. వాస్తవానికి ఎమ్మెల్యే దినేష్ రాయ్ రైతులకు పంట బీమా పథకాన్ని ప్రారంభించేందుకు దీపం వెలిగించినప్పుడు చేతులకు నూనె అంటుకుంది. ఆ మరక తుడుచుకోడానికి ఆయన మాజీ ఎంపీ చీరను వాడుకున్నారు.
ఈ విషయం స్థానిక టీవీ ఛానళ్లలో ఒక్కసారిగా సంచలనం రేపింది. దాంతో రాయ్ వెంటనే నీతా పటేరియా వద్దకు వెళ్లి ఆమెకు క్షమాపణ చెప్పారు. అది ఊరికే సరదాగా చేసిన పని మాత్రమేనని ఆయన తెలిపారు. ఆమె తనకు వదిన లాంటివారని, ఇది సరదాగా చేసిన పని అని అన్నారు. ఈ విషయమై చట్టపరమైన చర్యలు తీసుకోవాలా.. వద్దా అనే విషయాన్ని రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వర్గాలకే వదిలేస్తున్నట్లు నీతా పటేరియా చెప్పారు. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో పటేరియా చేతుల్లో దినేష్ రాయ్ ఓడిపోయారు.