మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భారీ వరం ప్రకటించారు.
మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భారీ వరం ప్రకటించారు. వాళ్ల నియోజకవర్గాల అభివృద్ధి నిధులను ఒకేసారి దాదాపు మూడు రెట్లు పెంచారు. ప్రస్తుతం ఎమ్మెల్యే లాడ్ కింద నిధులు కేవలం రూ. 77 లక్షలు మాత్రమే ఉండగా, దాన్ని రూ. 2 కోట్లకు పెంచుతున్నట్లు ఆ రాష్ట్ర అసెంబ్లీలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం ప్రకటించారు. మరో రెండేళ్లలో మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.
ఛత్తీస్‌గఢ్ విడిపోయిన తర్వాత 2003 నుంచి ఇప్పటివరకు మూడుసార్లు ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా, ప్రతిసారీ బీజేపీయే గెలుస్తూ వచ్చింది. 2003లో అధికారం చేపట్టినప్పుడు ఉమాభారతి, బాబూలాల్ గౌర్, శివరాజ్ సింగ్ చౌహాన్ ఒకరి తర్వాత ఒకరు ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు చౌహాన్ నాయకత్వానికి ఎదురులేకుండా కొనసాగుతోంది. ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టిన బీజేపీ.. రాబోయే ఎన్నికల్లో కూడా విజయపతాకం ఎగరేయాలన్న ఉద్దేశంతోనే ఈ భారీ పథకాన్ని చేపడుతోందని అంటున్నారు.