
ఎమ్మెల్యే తనయుడి కారు బీభత్సం
ముగ్గురు మృతి
జైపూర్: రాజస్తాన్‌లోని జైపూర్‌లో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. స్వతంత్ర ఎమ్మెల్యే నంద కిషోర్ మహారియా తనయుడు సిద్ధార్థ్ మహారియా మద్యం మత్తులో వేగంగా కారు నడుపుతూ ఆటోను, అనంతరం పీసీఆర్ వాహనాన్ని ఢీకొట్టడంతో ముగ్గురు మరణించగా, నలుగురు పోలీసులు గాయపడ్డారు. సీ-స్కీమ్ ప్రాంతంలో రాత్రి 1.30 గంటలకు ఈ ఘటన జరిగింది. కారు మొదట ఆటోను ఢీకొట్టి అనంతరం పక్కనే ఉన్న పీసీఆర్ వాహనంపైకి దూసుకెళ్లింది. ఆటోలోని ప్రయాణికుల్లో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు.
విధుల్లో ఉన్న అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్‌తో పాటు మరో ముగ్గురు పోలీస్ సిబ్బంది గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మరణించారు. కారులోని నలుగురిలో ఇద్దరు పరారు కాగా, ఎమ్మెల్యే తనయుడిని, మరొకర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తాను డ్రైవింగ్ చేయలేదని, మద్యం సేవించలేదని సిద్ధార్థ చెప్పారు.