న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఏడాదికి సరాసరి ఒక్కొక్కరు రూ. 24.59 లక్షల ఆదాయం ఆర్జిస్తున్నట్లు వెల్లడైంది. ఆ జాబితాలో కర్ణాటక ఎమ్మెల్యేలు సగటున రూ. కోటికి పైగా వార్షిక ఆదాయంతో ముందంజలో, ఛత్తీస్‌గఢ్ ఎమ్మెల్యేలు రూ. 5.4 లక్షలతో చివరి స్థానంలో ఉన్నారు. ఎన్నికల సంస్కరణ కోసం కృషి చేస్తున్న అసోషియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ అండ్ ద నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థ.. దేశవ్యాప్తంగా 4,086 మంది ఎమ్మెల్యేలకు గాను 3,145 మంది ఎన్నికల అఫిడవిట్ల వివరాల్ని విశ్లేషించి జాబితాను రూపొందించింది. 941 మంది ఎమ్మెల్యేలు అఫిడవిట్లలో ఆదాయాన్ని ప్రకటించనందున వారిని పరిగణనలోకి తీసుకోలేదు.
ఈ నివేదిక అంశాల్ని పరిశీలిస్తే..
1. దేశంలోని 3,145 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల వార్షిక సరాసరి ఆదాయం 24.59 లక్షలు..
2. దక్షిణ భారతదేశంలో 711 మంది ఎమ్మెల్యేల గరిష్టంగా ఒక్కొక్కరు 51.99 లక్షలు ఆర్జిస్తున్నారు.
3. తూర్పు ప్రాంతంలోని 614 మంది ఎమ్మెల్యేలు సరాసరి ఒక్కొక్కరు 8.53 లక్షలు మాత్రమే సంపాదిస్తున్నారు.
4. రాష్ట్రాల వారీగా చూస్తే కర్ణాటకలోని 203 మంది ఎమ్మెల్యేలు సరాసరిన ఏడాదికి రూ. 1.12 కోట్లు ఆర్జిస్తూ అగ్రస్థానంలో ఉన్నారు.
5. ఆ తర్వాతి స్థానంలో మహరాష్ట్రకు చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు 43.4 లక్షల సంపాదిస్తూ రెండో స్థానంలో ఉన్నారు.
6. ఛత్తీస్‌గఢ్ ఎమ్మెల్యేలు అతితక్కువ ఆదాయం పొందుతున్నట్లు ఏడీఆర్ సర్వే విశ్లేషించింది. ఆ రాష్ట్రంలో 63 మంది ఎమ్మెల్యేల ఆదాయాల్ని విశ్లేషించగా.. ఒక్కొక్కరు సగటును రూ. 5.4 లక్షలు సంపాదిస్తున్నారు. ఆ తర్వాతి స్థానంలో ఉన్న జార్ఖండ్ ఎమ్మెల్యేల ఆదాయం రూ. 7.4 లక్షలు.
7. ఆదాయార్జనలోను లింగ వివక్ష స్పష్టంగా కనిపించింది. మహిళా ఎమ్మెల్యేల కంటే పురుష ఎమ్మెల్యేల ఆదాయం రెండు రెట్లు ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. పురుష ఎమ్మెల్యేల వార్షికాదాయం 25.85 లక్షలుగా ఉండే మహిళా ప్రజాప్రతినిధుల ఆర్జన కేవలం రూ. 10. 53 లక్షలే.
మొత్తం 3,145 మందికిగాను 55 మంది ఎమ్మెల్యేలు అఫిడవిట్‌లో వృత్తి వివరాలు పేర్కొనలేదు. ఇక వ్యాపారాన్ని 777 మంది, వ్యవసాయాన్ని 758 మంది తమ వృత్తిగా పేర్కొన్నారు. 1,052 మంది విద్యార్హత 5 నుంచి 12వ తరగతి వరకూ పేర్కొనగా వారి వార్షికాదాయం 31 లక్షలుగా ఉంది. 1,997 మంది విద్యార్హతను డిగ్రీగా పేర్కొనగా వారి ఆదాయం 20.87 లక్షలు. 134 మంది ఎమ్మెల్యేల విద్యార్హత 8వ తరగతి కాగా.. వారి ఆదాయం 89.88 లక్షలు.
ఎమ్మెల్యే ఆదాయం 24.59 లక్షలు
Published Tue, Sep 18 2018 2:43 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment