
ఉగ్ర కారకులు తప్పించుకోలేరు: మోదీ
న్యూఢిల్లీ: యూరిలో ఉగ్ర దాడికి తెగబడ్డ వారిని శిక్షించి తీరుతామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఉగ్ర కారకులు శిక్ష నుంచి తప్పించుకోలేరని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నట్లు చెప్పారు. దాడిని హేయమైన, పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఈ మేరకు మోదీ ట్వీట్ చేశారు. దాడిలో అసువులు బాసిన సైనికులకు జోహార్లు పలికిన ప్రధాని.. అమర జవాన్ల సేవలను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు.
కుయుక్తులను తిప్పికొడతాం: ప్రణబ్
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని యూరి సైనిక క్యాంపుపై ఉగ్రదాడిని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఖండించారు. ఉగ్రవాదులు, వారికి అండగా నిలిచిన వారి కుయుక్తులను భారత్ తిప్పికొడుతుందని పరోక్షంగా దాయాది దేశం పాకిస్తాన్‌ను హెచ్చరించారు. ఇటువంటి దాడులకు భారత్ భయపడబోదని స్పష్టం చేశారు. దేశ సేవలో ప్రాణ త్యాగం చేసిన సైనికులకు ఘన నివాళులర్పించిన రాష్ట్రపతి...మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.