జమ్మూ కశ్మీర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. ఒకరోజు పర్యటన నిమిత్తం ఆయన శుక్రవారం ఉదయం ప్రత్యేక విమానంలో జమ్మూ కశ్మీర్ చేరుకున్నారు.
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. ఒకరోజు పర్యటన నిమిత్తం ఆయన శుక్రవారం ఉదయం ప్రత్యేక విమానంలో జమ్మూ కశ్మీర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, పలువురు సీనియర్ మంత్రులు తదితరులు ప్రధానికి ఘనస్వాగతం పలికారు. అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గిరిధర్ లాల్ దోగ్రా 100వ జయంతి సందర్భంగా ప్రధాని ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా గిరిధర్ లాల్ దోగ్రా సేవలను మోదీ గుర్తు చేశారు. జమ్మూ కశ్మీర్లో నేతలకు దోగ్రా ఆదర్శంగా నిలిచారని, ఆయన భౌతికంగా లేకున్నా, డోగ్రా మన స్మృతుల్లోనే ఉన్నారని అన్నారు. కాగా ప్రధానితో పాటూ, గిరిధర్ దోగ్రా అల్లుడు, కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మోదీ తన పర్యటనలో జమ్మూ కశ్మీర్ అభివృద్ధికి రూ. 70 వేల కోట్ల విలువ గల ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉంది.ఈ నిధులతో జమ్మూకశ్మీర్‌లో పునరావాస, అభివృద్ధి కార్యక్రమాలు , గతేడాది వరద బాధితుల సహాయానికి ఖర్చు చేయనున్నారని సమాచారం. అలాగే జమ్మూకు మోదీ ఎయిమ్స్ ప్రకటిస్తారని ఆశిస్తున్నారు. జమ్మూ వర్సిటీ సందర్శించి, జనరల్ జోర్వార్ సింగ్ ఆడిటోరియంలో ప్రసంగించనున్నారు. కాగా సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తల నేపథ్యంలో మోదీ పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పర్యటన అనంతరం ఈ సాయంత్రం ఆయన రాజధానికి తిరిగి పయనమవుతారు.