
మధ్యతరగతిలో మసకబారిన మోదీ ప్రతిష్ట...
మోదీకి అనుకూలంగా వస్తున్న ప్రచారం పక్కకు జరిగిపోయింది. అంతా బాగుందనే భావన తొలగిపోవటం మొదలైం ది. సంఘ్ దుందుడుకు వ్యక్తులను మందలించటానికి మోదీ నిరాకరించటం.. ఆయనను నిర్ణయాత్మకమైన నేతగా చూసిన మధ్య తరగతి మద్దతుదారుల్లో ఆయన ప్రతిష్టను మసకబార్చింది. చరిత్ర పుస్తకాలను తిరగరాయటం, సంస్కృత భాషను ప్రవేశపెట్టటం, పురాతన కాలంలోనే ప్లాస్టిక్ సర్జరీని కనుగొనటం వంటి అంశాల వెనుక ఉన్న అనివార్యతలేమిటో అంతుచిక్కనివి. మోదీ మౌనాన్ని.. గత 30 ఏళ్లలో ఏ ప్రధానికీ లేనంతటి సంపూర్ణ అధికారంతో వచ్చిన అహంకారంతో కూడిన ఉదాసీనతగా భావించారు.
క్రిస్మస్ రోజును సుపరిపాలన దినంగా ప్రకటించటాన్ని నిరంకుశత్వ దెబ్బగా భావించారు. ఈ పరిస్థితుల్లో.. బీజేపీకి అపరిమిత అధికారం కట్టబెట్టటంలో ఉన్న ప్రమాదాల గురించి మధ్య, ఉన్నత తరగతి సమావేశాల్లో చర్చించుకోవటం వినిపించింది. ఈ భయాలకు.. విద్యార్థులకు ఉపాధ్యాయుడు బోధన చేసినట్లు మంత్రులకు, ఎంపీలకు మోదీ బోధనలు చేయటం, అధికారులతో వ్యవహరిస్తున్న తీరుపై కథనాలు ఆజ్యం పోశాయి. ఈ నేపథ్యంలోనే.. బీజేపీలోకి కిరణ్‌బేడీని బరిలోకి దింపాలన్న వారి నిర్ణయాన్ని.. అతివిశ్వాసంతో తీసుకున్న నిర్ణయంగా పరిగణించారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా పర్యటనలో సైతం మోదీ వ్యవహరించిన తీరు.. ఆయన్ను ఇంటి పేరుతో పిలవటం, తన పేరును అల్లిన ఖరీదైన దుస్తులు ధరించటం.. మోదీ ‘మహత్వోన్మాదం’ వ్యక్తీకరణగా భావించారు.