
ఆ రోజు మోదీ టీవీ చూడలేదు
- ‘ద మోదీ ఎఫెక్ట్’ పుస్తకంలో విశేషాలు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడ్డ 2014 మే 16న నరేంద్రమోదీ ఏం చేశారు? తన గదిలో ఒంటరిగా ధ్యానం చేసుకుంటూ గడిపారు. టీవీ కూడా చూడలేదు. మధ్యాహ్నం 12 గంటల తర్వాతే టెలిఫోన్ కాల్స్‌ను స్వీకరించారు. అదీ తొలి ఫోన్ కాల్ అప్పటి బీజేపీ చీఫ్ రాజ్‌నాథ్‌సింగ్ చేసినది. ఎన్నికల్లో పార్టీ విజయ ఢంకా ఖాయమైపోయిందనేది రాజ్‌నాథ్ ఫోన్ సారాంశం. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మోదీ వెల్లడించారు.
బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ మాజీ మీడియా సలహాదారు లాన్స్ ప్రైస్ రచించిన ‘ద మోదీ ఎఫెక్ట్: ఇన్‌సైడ్ నరేంద్ర మోదీస్ క్యాంపెయిన్ టు ట్రాన్స్‌ఫామ్ ఇండియా’ పుస్తకంలో మోదీ గురించి, ఆయన జీవితం గురించి ఇలాంటి ఆసక్తికర అంశాలున్నాయి. ఈ పుస్తకాన్ని భారత్‌లో హాచెట్ సంస్థ ప్రచురించింది. ప్రధానితో పాటు.. పియూష్‌గోయల్ తదితర ఆయన కేబనెట్ సహచరులు, సలహాదారులు, విశ్లేషకుల బృందంతో ఇంటర్వ్యూల దీన్ని రచించారు.
ఈ పుస్తకం ప్రకారం.. 2012 గుజరాత్ ఎన్నికల్లో తన గెలుపు నాటి నుంచే.. పార్టీ ప్రధాని అభ్యర్థుల్లో తనను ఒకరిగా పరిగణిస్తారన్న విషయంపై తనకు స్పష్టత ఉందని మోదీ పేర్కొన్నారు. ‘కానీ నెను ఎన్నడూ వాస్తవంగా దాని గురించి ఆలోచించలేదు. నన్ను ప్రధాని అభ్యర్థిగా నామినేట్ చేసేలా పార్టీలో లాబీ చేయటానికీ ప్రయత్నించలేదు.
అసలు నన్ను కానీ, మరొకరిని కానీ నామినేట్ చేస్తారా అన్న అంశంపైనా నాకు ఆసక్తి లేదు.. ఎన్నికలకు ముందు మీడియాకు అందుబాటులో ఉండరాదనుకున్నాను. మీ(మీడియా) ఆసక్తిని పొందాలనుకున్నాను’ అని చెప్పారు. బడా కార్పొరేట్ దాతలతో బీజేపీ అనుబంధంపై స్పందిస్తూ.. ‘కార్పొరేట్ సంస్థలకు చెందిన ప్రైవేట్ విమానాన్ని మేం వినియోగిస్తున్నామని చాలా రాస్తున్నారు. ప్రచారాన్ని నడిపించడానికి అవసరమైతే నేను సైకిళ్లు కూడా అద్దెకు తీసుకుంటాను’ అని మోదీ అన్నట్లు పుస్తకంలో ఉంది.