నేడు చైనాకు ప్రధాని
బ్రిక్స్ సదస్సుకు హాజరుకానున్న నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: చైనాలో జరగనున్న బ్రిక్స్ దేశాల సదస్సు నుంచి ఫలవంతమైన చర్చలు, సానుకూల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బ్రిక్స్ సదస్సు కోసం నేడు చైనాకు బయల్దేరి వెళ్లనున్న సందర్భంగా ఆయన ప్రకటన విడుదల చేశారు. ‘గోవా బ్రిక్స్ సదస్సు ద్వారా సాధించిన ఫలితాలు తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉన్నాను. శాంతి, భద్రత, ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారంలో బ్రిక్స్ కూటమి ముఖ్య భూమిక పోషించింది’ అని ప్రధాని అన్నారు.
బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలు సభ్య దేశాలుగా ఉన్న బ్రిక్స్ సదస్సు సెప్టెంబర్ 3 నుంచి 5 వరకూ చైనాలోని గ్జియామెన్ నగరంలో జరగనుంది. బ్రిక్స్ సదస్సు వేదికగా దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతామని వెల్లడించారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అధ్యక్షతన సెప్టెంబర్ 5న జరిగే ‘ఎమర్జింగ్ మార్కెట్స్, అండ్ డెవలపింగ్ కంట్రీస్’ సదస్సులో పాల్గొనడంతో పాటు, బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్‌తో కూడా భేటీ అవుతామని ప్రకటనలో పేర్కొన్నారు.
బ్రిక్స్ సదస్సు వేదికగా జిన్‌పింగ్ ప్రధాని ప్రత్యేక చర్చలు జరపవచ్చని భావిస్తున్నారు. మయన్మార్ పర్యటన గురించి స్పందిస్తూ.. భద్రత, ఉగ్రవాద పోరు, వాణిజ్యం, పెట్టుబడులు, మౌలిక వసతులు, ఇంధనం, సంస్కృతి రంగాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న సహకారం బలోపేతం కోసం ఇరు దేశాలు ఆసక్తిగా ఉన్నాయని మోదీ అన్నారు. మయన్మార్‌లో సెప్టెంబర్ 5 నుంచి 7 వరకూ మోదీ పర్యటిస్తారు.