
నేడు శ్రీనగర్ వెళ్లనున్న మోదీ
శ్రీనగర్: ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం శ్రీనగర్ వెళ్లనున్నారు. కశ్మీర్ లోయలో మోదీ ఎన్నికల సభను పురస్కరించుకుని నగరంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సభ జరిగే షేర్-ఇ-కశ్మీర్ స్టేడియంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలపై నిరంతర నిఘా నిమిత్తం ఇప్పటికే హెలికాఫ్టర్లను రంగంలోకి దించారు. శ్రీనగర్ అత్యుత్తమమైన రక్షణ చట్రంలో ఉంది. ఇక్కడ జరిగే బీజేపీ ఎన్నికల సభలో మోదీ ప్రసంగించనున్నారు. కాగా యూరీలోని సైనిక శిబిరంపై దాడి చేసిన ఆరుగురు ఉగ్రవాదులు లష్కరే తోయిబాకు చెందినవారేనని, వారికి పాక్ సంస్థ మద్దతు ఉందనేందుకు తగిన సాక్ష్యం ఉందని ఆర్మీ తెలిపింది.
కశ్మీరీల లక్ష్యంగానే: కశ్మీర్‌లో మిలిటెంట్లు యూరి సైనిక క్యాంపుపై చేసిన దాడి వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆర్మీ అనుమానిస్తోంది. భారీ ఎత్తున కశ్మీర్ ప్రజలను లక్ష్యం చేసుకునే టైస్టులు తెగబడ్డారని సైనిక దళాల ఉన్నతాధికారి ఒకరు అన్నారు.