
సాక్షి, బెంగళూరు : హిందూత్వ సంస్థ శ్రీరామ సేన అధ్యక్షుడు ప్రమోద్ ముథాలిక్ ప్రముఖ పాత్రికేయురాలు గౌరీలంకేశ్ హత్యకేసును ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గౌరీలంకేశ్‌ను ఆయన కుక్కతో పోల్చారు. గౌరీలంకేశ్ హత్యపై ప్రధాని మోదీ ఎందుకు స్పందించడం లేదని కొందరు తప్పుపడుతున్నారని, కర్ణాటకలో ఏ కుక్క చనిపోయినా ఆయన బాధ్యత వహించాలా? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
‘గౌరీలంకేశ్ హత్య విషయంలో శ్రీరామసేనకు ఎలాంటి సంబంధం లేదు. గౌరీలంకేశ్‌ను చంపేందుకు హిందూ సంస్థలు కుట్ర చేశాయని ప్రతి ఒక్కరూ అంటున్నారు. కానీ, కాంగ్రెస్ పాలనలో ఉన్న సమయంలో మహారాష్ట్రలో రెండు హత్యలు, కర్ణాటకలో రెండు హత్యలు జరిగాయి. ఈ ఘటనల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎవరూ ప్రశ్నించడం లేదు. అందుకు బదులుగా ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆయన ఎందుకు మాట్లాడటం లేదు? అని అంటున్నారు. కర్ణాటకలో ఏ కుక్క చనిపోయినా.. మోదీ బాధ్యత వహించాలా’ అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో తాను నేరుగా గౌరీలంకేశ్‌ను కుక్కతో పోల్చలేదని ప్రమోద్ ముథాలిక్ వివరణ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment