భారీ అమ్మకాల్లో మోదీ పుస్తకం!
ప్రధానమంత్రి నరేంద్రమోదీని వ్యంగ్యాస్థాలతో కించిపరుస్తూ ఇటీవల మార్కెట్లో విడుదలైన పుస్తకం అమ్మకాలు భారీగా పెరిగిపోయాయట. 'ఫెకూజీ ఈజ్ ఇన్ ఢిల్లీ నౌ' పేరుతో కాంగ్రెస్ నాయకుడు జయేష్ షా రచించిన పుస్తకానికి అభిమానులు ఎక్కువైపోయారు. గుజరాత్ రాష్ట్రంలోనే కాక, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ లలో కూడ పుస్తకం అమ్మకాలు జోరుగా సాగిపోతున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ నాయకుడు జయేష్ షా మోదీపై వ్యంగ్యోక్తులు విసురుతూ రాసిన పుస్తకం మార్కెట్లో ప్రాచుర్యం పొందిందట. పలు రాష్ట్రాల్లో ఆ పుస్తకానికి భారీ అమ్మకాలు పెరిగినట్లు వార్తలొస్తున్నాయి. 'ఫెకూజీ ఈజ్ ఇన్ ఢిల్లీ నౌ' అంటూ ఎన్నికల సమయంలో మోదీ చేసిన వాగ్దానాలను నెరవేర్చకపోవడంపై జయేష్ షా ఈ పుస్తకాన్ని రాశారు. అయితే పుస్తకంలోని రచనలు ప్రధానమంత్రిని కించపరిచేలా ఉన్నాయని, దీన్ని వెంటనే నిషేధించాలని కోరుతూ బీజేపీ అభిమాని, సామాజిక కార్యకర్త నర్సింహు సోలంకి అనేవ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, దాన్ని అహ్మదాబాద్ సివిల్ కోర్టు కొట్టేయడం తెలిసిందే. తమ భావాలను తెలిపే హక్కు ప్రతివారికీ ఉంటుందని, పుస్తకంపై నిషేధం విధించడం సరికాదని, అలా చేస్తే వాక్ స్వాతంత్రంపై దాడి చేసినట్లే అవుతుందని న్యాయమూర్తి వివరణ కూడ ఇచ్చారు.
అయితే మోదీపై వ్యంగ్యాస్థాలు సంధిస్తూ రాసిన ఆ పుస్తకం గురించి ముందు ఎవరికైనా తెలుసో లేదో గాని, కోర్టు సైతం అభ్యంతరాలను తోసి పుచ్చడంతో ఇప్పుడు ఆ పుస్తకానికి మార్కెట్లో భారీ డిమాండ్ పెరిగిపోయిందట. నిజంగా ఆ పుస్తకంలో ఇంకా ఏం రాశారో చదవాలన్న ఉత్కంఠత జనాల్లో పెరిగిపోయిందికాబోలు.