కర్ణాటక, యశవంతపుర: ఒకవైపు ప్రపంచం మొత్తాన్ని చైనా కరోనా వైరస్ బీభత్సానికి గురిచేస్తోంది. మరోవైపు రాష్ట్రంలో మలెనాడు ప్రాంతంలో కోతి జ్వరం (మంకీ ఫీవర్) మళ్లీ తెరపైకి వచ్చింది. ఇప్పటి వరకు ముగ్గురికి ఈ వైరస్ సోకింది. వైరస్ కేసులు రోజురోజు వ్యాపిస్తూ నిద్ర లేకుండా చేస్తున్నాయి. చిక్కమగళూరు జిల్లావ్యాప్తంగా కెఎఫ్‌డి (క్యాసనూరు ఫారెస్ట్ డిసీజ్) అలియాస్ కోతి జ్వరం వైరల్‌గా మారింది. సుమారు రెండేళ్ల కిందట పలు తాలూకాల్లో ఈ వ్యాధి ప్రబలడం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు జడలు విప్పుతోంది.
లక్షణాలు ఇవీ
తీవ్రమైన జ్వరం, తల నొప్పి, ముక్కు, నోట్లోంచి రక్తం కారడం, వాంతులు, కండరాలు పట్టేయడం,ఒళ్లు నొప్పులు, వణకడం, మానసిక వ్యాకులత వంటి లక్షణాలు కనిపిస్తాయి. చికిత్స తీసుకుంటే రెండువారాల్లో తగ్గిపోతాయి. కానీ ఒళ్లునొప్పులు కొన్ని నెలలపాటు వెంటాడుతాయి.
గ్రామాల్లో వైద్య శిబిరాలు
అసోం నుంచి వచ్చిన వలస కూలీ కార్మికులకు సోకినట్లు వైద్యాధికారులు గుర్తించారు. ఎన్‌ఆర్ తాలూకా మడబూరు గ్రామంలో కాఫీ తోటలో పని చేస్తున్న 60 మంది అసోం కూలీల్లో ముగ్గురికీ సోకింది. దీనితో జిల్లావ్యాప్తంగా నివారణ చర్యలను చేపట్టారు. మడబూరుకు ఐదు కిలోమీటర్ల పొడవునా క్రిమి సంహారక మందులను చల్లుతున్నారు. ఈ తరుణంలో ఎన్‌ఆర్ పురతో పాటు కొప్ప, శృంగేరి, మూడిగెరె గ్రామీణ భాగాలలో వైద్యులు సంచార వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఒకరకమైన జ్వరంతో మరణించిన కోతుల ద్వారా ఈ జబ్బు మనుషులకు సోకుతోందని వైద్యాధికారులు గుర్తించారు. చిన్న పిల్లలకు సోకకుండా అధికారులు కెఎఫ్‌డీ రోగ నిరోధక చుక్కలను వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు భయపడవలసిన పని లేదని జిల్లా మంత్రి సీటీ రవి తెలిపారు. ఆయన మంగళవారం అధికారులతో సమీక్షను నిర్వహించారు. వైరస్ వ్యాపించకూండ జిల్లా యంత్రం అన్ని చర్యలు తీసుకొంటుందని, ప్రజలు కూడా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment