రేప్ కేసులకు నిలయంగా రాజధాని!
ప్రపంచ దేశాల్లోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు పొందిన భారతదేశ రాజధాని ఢిల్లీ... ఇప్పుడు హింసా కార్యకలాపాలకు ప్రధాన కేంద్రమైంది. అత్యాచారాలకు, మానభంగాలకు మారుపేరుగా నిలిచి మహిళకు రక్షణే కరువయ్యింది. దేశంలోని నాలుగు ప్రధాన నగరాలతో పోలిస్తే ఢిల్లీలో గత మూడేళ్ళుగా అత్యాచారాలు, లైంగిక హింసల కేసుల నమోదు ఎక్కువైనట్లు తాజా లెక్కలు చెప్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి 25 శాతం రేప్ కేసులు పెరిగినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. అదే విధంగా వీధి నేరాలు, దొంగతనాలు, వేధింపుల కేసులు కూడా పెరగడం ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురిచేస్తోంది.
ముఖ్యంగా మహిళలపై నేరాల సంఖ్య స్థిరంగా పెరుగుతున్నట్లు ఏకంగా పోలీసు వర్గాలే చెప్తున్నాయి. అంతేకాక సుమారు ప్రతి వెయ్యి నిమిషాలకు ఓ మహిళ అత్యాచారానికి గురౌతున్నట్లు నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో తాజా సర్వేలో తేలింది. ఢిల్లీ శివారు ప్రాంతాలు మినహా జరిపిన సర్వేలో ఈ పచ్చి నిజాలు వెల్లడయ్యాయి. ముఖ్యంగా ఉచిత ఎఫ్ ఐ ఆర్ రిజిస్ట్రేషన్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడ ఈ పెరుగుదల కనిపిస్తోందని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బి. ఎస్. బాసీ చెప్తున్నారు. 2014 నవంబర్ వరకూ నమోదైన 1,39,799 కేసులతో పోలిస్తే... 2015 నవంబర్ 30 నాటికి 1,74,423 కేసులు దాఖలైనట్లు ఆయన వెల్లడించారు.
ముఖ్యంగా దేశ రాజధానిలో మహిళలపై వేధింపులకు సంబంధించిన కేసులు 25 శాతం అధికంగా నమోదయ్యాయి. 2014 లో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో వేధింపులపై సుమారు 4000 ఫిర్యాదులు అందగా... ఆ సంఖ్య 2015 నాటికి 5.027 కు పెరిగింది. అలాగే 2014లో రాజధానిలో అత్యాచార కేసులు సుమారు 1,997 నమోదవ్వగా అది 2015 నాటికి 2,005 కు చేరింది. నిర్భయ గ్యాంగ్ రేప్ జరిగిన 2012 నాటికి ఢిల్లీలో అత్యాచార కేసులు 706 కాగా.. నేడు అవి వేలల్లోకి చేరాయి.
రాజధాని ఢిల్లీలో వీధి నేరాలు, దొంగతనాలు, చైన్ స్నాచింగ్ ల వంటివి కూడా రోజు రోజుకూ పెరుగుతున్నాయి. 2014 తో పోలిస్తే ఢిల్లీ రోడ్లు అభద్రతకు నిలయాలుగా మారినట్లు తాజా నివేదికలు తేల్చి చెప్తున్నాయి. దీనికి తోడు రాబరీలు ఇరవై శాతం, చైన్ స్నాచింగ్ లు 30 శాతం పెరిగాయి. అయితే ఒకప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఎన్నో అడ్డంకులు ఉన్నా... ప్రస్తుతం ఎటువంటి ఇబ్బందులూ లేవని, ఫ్రీ రిజిస్టేషన్ అమల్లో ఉందని ఢిల్లీ కమిషనర్ బి ఎస్ బాసీ చెప్తున్నారు. అంతేకాక వాహన చోరీల వంటి కేసులను ఆన్ లైన్ ద్వారా కూడ రిజిస్టర్ చేసే అవకాశం కల్పించినట్లు జాయింట్ కమిషనర్ ర్యాంక్ అధికారి చెప్తున్నారు. అయితే ఢిల్లీ ప్రజల రక్షణ కోసం ఎన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసినా క్రైం రేటు పెరుగుతుండటం ఢిల్లీ పోలీసులకు సవాల్ గా మారుతోంది.
2014 లో 5,873 గా ఉన్న చైన్ స్నాచింగ్, వాహన చోరీల కేసులు 2015 లో 6,969 కి పెరిగాయి. దోపిడీలు, దొంగతనాలు, వేధింపుల కేసులు 2014 నుంచి 2015 నాటికి 15 నుంచి 30 శాతం పెరిగిపోయాయి. రాబోయే రోజుల్లో పెండింగ్ కేసుల వ్యవహారం కూడా పెద్ద సమస్యగా మారనుందని పోలీసు అధికారులు తలలు పట్టుకుంటున్నారు.