
సగం మంది రైతులకు చేరాలి
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పంట బీమా పథకంపై రైతుల్లో అవగాహన పెంచి రెండేళ్లలో 50 శాతం అన్నదాతలకు బీమా వర్తింపచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
♦ పంట బీమా పథకంపై ప్రధాని మోదీ
♦ రెండేళ్లలో లక్ష్యం సాధించాలని పిలుపు
విశాఖ ‘ఫ్లీట్ రివ్యూ’ దేశ నేవీ చరిత్రలోనే అద్భుతమని మన్‌కీ బాత్‌లో వ్యాఖ్య
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పంట బీమా పథకంపై రైతుల్లో అవగాహన పెంచి రెండేళ్లలో 50 శాతం అన్నదాతలకు బీమా వర్తింపచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో (ఈ ఏడాది తొలి రేడియో ప్రసంగం) ఆదివారం మాట్లాడుతూ.. ‘దేశంలో రైతు గురించి చాలా మాట్లాడతారు. చర్చల్లోకి వెళ్లటం మనకు అనవసరం. కానీ ఇప్పుడు రైతు చాలా సమస్యల్లో ఉన్నాడు. ప్రకృతి విపత్తులు వచ్చినపుడు వారి శ్రమంతా వృథా అవుతుంది. ఇలాంటప్పుడు ఆయనకు సాంత్వన చేకూర్చేది పంట బీమా ఒక్కటే’ అని అన్నారు.. చాలా ఏళ్లుగా దేశంలో పంటబీమాపై చర్చ జరుగుతోందని.. కానీ, 20-25 శాతం మందికే దీని లబ్ధి అందుతోందన్నారు.
ఈ సంఖ్యను రెండేళ్లలో 50 శాతానికి చేర్చేలా రైతులను చైతన్యపరిచే కార్యక్రమాల్లో మీ భాగస్వామ్యం కావాలని దేశ ప్రజలను మోదీ కోరారు. నాట్లు వేసిన 15 రోజుల్లో ప్రకృతి విపత్తులు వచ్చినా, అన్నదాతకు బీమా అందుతుంది. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించటం ద్వారా ఈ బీమా వీలైనంత త్వరగా రైతుకు చేరేలా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. జనవరి 16న ప్రారంభించిన ‘స్టార్టప్ ఇండియా’తో యువతలో కొత్త శక్తి, చైతన్యం, ఉత్సాహం కనబడుతోందని.. లక్షల సంఖ్యలో యువత ఇందులో పాల్గొనేందుకు తమ పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. ‘గతంలో స్టార్టప్ అంటే ఐటీ రంగానిదే అనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పడు వ్యవసాయం మొదలుకుని ప్రతి రంగంలో స్టార్టప్‌లు వస్తున్నాయి. ఈ పథకం కింద అపారమైన అవకాశాలున్నాయి’ అని చెప్పారు.
సిక్కిం పర్యటనలో ఇద్దరు ఐఐఎం విద్యార్థులు సేంద్రియ పద్ధతుల్లో ఔషధ మొక్కలను పెంచుతూ.. అంతర్జాతీయ మార్కెట్లో విక్రయిస్తున్నారని.. మరో వ్యక్తి ఆన్‌లైన్ ద్వారా భోజనం పంపుతున్నారని.. మరో యువకుడు పశువులకు నాణ్యమైన దాణా ఇవ్వటంపై పనిచేస్తున్నారని.. ఇలా చాలామంది యువత స్టార్టప్‌లో భాగంగా చేస్తున్న కార్యక్రమాలను తనకు పంపిస్తునారని ప్రధాని వెల్లడించారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల్లు, గుళ్లు, మసీదులు, చర్చిల్లో స్వచ్ఛతను పాటించటంతోపాటు.. వాటి చిత్రాలను తనకు పంపించాలని ప్రజలను కోరారు. ‘మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా జనవరి 30న దేశ ప్రజలంతా సరిగ్గా 11గంటలకు రెండు నిమిషాలపాటు మౌనం పాటిస్తే.. దానినుంచి ఎంత శక్తి వస్తుందో ఊహించగలమా?’ అని మోదీ అన్నారు.
దేశ వ్యాప్తంగా ఖాదీ దుస్తుల వినియోగంపై అవగాహన పెరిగిందని.. ప్రత్యేకంగా యువత ఖాదీ దుస్తులను ఎక్కువగా వినియోగిస్తున్నారని ప్రధాని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఒక జత ఖాదీ దుస్తులను బీరువాలో ఉంచుకుంటే బాగుంటుందన్నారు. ఫిబ్రవరి 4నుంచి 8 వరకు విశాఖపట్టణంలో జరిగే అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ గురించి మాట్లాడుతూ.. వివిధ దేశాల నేవీ బలగాలు, నౌకలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయని.. దేశ నేవీ చరిత్రలోనే ఇదో గొప్ప కార్యక్రమమన్నారు.
ఆడపిల్లపై ఆలోచన మారుతోంది..
బాలికల మరణాల్లో భారతదేశంలోనే అత్యంత దారుణమైన లింగ నిష్పత్తి రికార్డున్న (775:1000) హరియాణాలో పరిస్థితిలో గణనీయమైన మార్పు కనబడుతోందని మోదీ తెలిపారు. ‘బేటీ బచావ్, బేటీ పఢావ్’ పథకం ప్రచారంతో సమాజంలో వచ్చిన మార్పుకు ఇదో నిదర్శనమన్నారు. హరియాణా ప్రభుత్వాన్ని ప్రధాని అభినందించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గుజరాత్, హరియాణా రాష్ట్రాల్లో చాలా చోట్ల ఆడపిల్లల చేతుల మీదుగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి.. ‘బాలిక’కు సరైన గౌరవాన్ని అందించాయని ప్రశంసించారు. గతేడాది ఆడపిల్లలు పుట్టిన కుటుంబాలకు రిపబ్లిక్‌డే పరేడ్ చూసేందుకు హరియాణా ప్రభుత్వం ఆహ్వానించి మొదటి వరుసలో కూర్చోబెట్టిందన్నారు. ఉగ్రదాడులు జరగొచ్చన్న హెచ్చరికలను పక్కనపెట్టి దేశవ్యాప్తంగా ప్రజలు రిపబ్లిక్ డేను ఘనంగా నిర్వహించారని మోదీ అభినందించారు.