ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : భారత్ లాంటి వర్ధమాన దేశాల్లో కరోనా వైరస్ లాంటి మహమ్మారి బారిన పడి ఎంత మంది చనిపోయారనే విషయం ఎప్పటికీ తేలదట. ఈ విషయాన్ని చెప్పిందెవరో కాదు, భారతలో మరణాలు–వాటి గణాంకాలపై విస్తృతంగా అధ్యయనం చేసిన డాక్టర్ ప్రభాత్ ఝా. ఆయన రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా సహకారంతో ‘మిలీనియన్ డెత్ స్టడీ’ పేరిట ఈ అధ్యయనం చేశారు. ఆయనెవరో కాదు, టొరాంటోలోని ‘సెంటర్ ఫర్ గ్లోబల్ హెల్త్ రిసర్చ్’ వ్యవస్థాపక డైరెక్టర్. ఆయన ‘బిల్ అండ్ మిలిండా ఫౌండేషన్’కు ఎక్స్‌పర్ట్ అడ్వైజర్‌గా కూడా పని చేస్తున్నారు. ప్రభాత్ ఝా అధ్యయనం ప్రకారం భారత్‌లో 80 శాతం మరణాలు గ్రామీణ ప్రాంతాల్లోనే జరుగుతాయి. వాటిలో 70 శాతం మరణాలు మాత్రమే రిజిస్టర్ అవుతాయి. వాటిలో కేవలం 22 శాతం మరణాలకు మాత్రమే మెడికల్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఆ సర్టిఫికెట్లలో కూడా ఎక్కువ వరకు గుండెపోటు కారణంగా మరణించారని పేర్కొంటారు. గుండెపోటు రావడానికి కారణాలేమిటో పేర్కొనరు.
( స్వదేశానికి రాక.. కరోనా పాజిటివ్ )
ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినా, ఎవరి చేతుల్లోన్నైనా దెబ్బలు తిన్నా గుండెపోటు వచ్చి మరణించవచ్చు. రోడ్డు ప్రమాదం వల్ల లేదా దాడి వల్ల అని పేర్కొంటే తప్పించి అసలు కారణం మనకు తెలియదు. పోలీసు కేసులు అయినప్పుడు మాత్రం వారు అటాప్సీకి పంపిస్తారు కనుక వాస్తవాలు నమోదవుతాయి. ఊర్లలో ప్రధానంగా జనన, మరణాల గణాంకాల కోసమే మరణాలను నమోదు చేస్తారు. కనుక వైద్యపరమైన కారణాలను పెద్దగా పట్టించుకోరు, అనుమానాస్పద కేసుల్లో తప్ప. ఈ కారణాల వల్ల భారత్ లాంటి వర్ధమాన దేశాల్లో ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తోన్న కరోనా మహమ్మారి మృతుల సంఖ్య ఎప్పటికీ తేలదని డాక్టర్ ప్రభాత్ ఝా అన్నారు. గ్రామల్లో ఎక్కువగా నిమోనియాతోపాటు ఇతర శ్వాసకోశ వ్యాధులతో మరణిస్తుంటారు. ఆ మరణాలను నమోదు చేసినా కూడా నిమోనియా, రెస్పిరేటరీ డిసీసెస్ లేదా రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అని మాత్రమే వైద్యులు పేర్కొంటారు. ( ఇప్పుడెలాగో.. అప్పుడూ అలాగే )
ఆ జబ్బులు రావడానికి కారణాలేమిటో పేర్కొనరు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ మరణాల్లో ఎక్కువగా కరోనా కేసులు ఉండవచ్చు. అటాప్సీ చేస్తేగానీ అసలు కారణం తెలియదు. ప్రస్తుతం భారత్‌లో కోవిడ్–ఆస్పత్రులు లేదా వార్డుల్లో మరణించిన కేసులు లేదా కోవిడ్ వైద్యులు వెళ్లి చికిత్స చేసినా ఫలితం లేక మరణించిన కేసులు మాత్రమే కరోనా కింద నమోదవుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో కరోనా మరణాలు ఎక్కువగా నమోదవడానికి, భారత్‌లో కేసులు తక్కువగా నమోదవడానికి ఈ విధానమే కారణం కావచ్చని డాక్టర్ ప్రభాత్ ఝా అభిప్రాయపడ్డారు. ప్రతి మరణం ఎందుకు సంభవించిందో పేర్కొన్నట్లయితే ఆ డేటా వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఆయన చెప్పారు. అందుకు ఆయన దక్షిణాఫ్రికాలో హెచ్‌ఐవీ కేసుల ఉదంతం వివరించారు. అక్కడ రోడ్డు, ఇతర ప్రమాదాల్లో మరణించిన వారికి కూడా హెచ్‌ఐవీ ఉందా, లేదా అన్న విషయాన్ని అటాప్సీ ద్వారా అధ్యయనం చేశారట. వారిలో ఎక్కువ మందికి హెచ్‌ఐవీ ఉందని తేలిందట. దాంతో అప్పటి వరకు హెచ్‌ఐవీ పరాయి దేశాల నుంచి సంక్రమించిందని భావించిన దక్షిణాఫ్రికా, తన దేశంలోనే పుట్టిందని గ్రహించిందట.
Comments
Please login to add a commentAdd a comment