ఢిల్లీ: దేశంలో ఒకవైపు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ.. మరో కలకలం మొదలైంది. భారత్‌లోకి ప్రవేశించిన.. కరోనా వేరియెంట్ ఒమిక్రాన్ కొత్త సబ్‌వేరియెంట్ దేశరాజధానిలో అలజడి సృష్టిస్తోంది. ఢిల్లీలోని లోక్ నాయక్ జై ప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రికి వచ్చిన శాంపిల్స్‌లో ఈ సబ్‌వేరియెంట్ నమునాలు గుర్తించినట్లు వైద్యాధికారులు తెలిపారు.
ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ బీఏ 2.75.. చాలా శాంపిల్స్‌లో గుర్తించినట్లు మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సురేష్ కుమార్ వెల్లడించారు. ఢిల్లీలో కోవిడ్ కేసులు.. పాజిటివిటీ రేటు పెరిగిపోతున్న వేళ.. ఆస్పత్రుల్లో చేరుతున్న బాధితుల సంఖ్యా పెరుగుతోందని డాక్టర్ సురేష్ వెల్లడించారు. ఇంతకు ముందు ఇన్‌ఫెక్షన్ ద్వారా సంక్రమించిన ఇమ్యూనిటీ, వ్యాక్సినేషన్‌ను లెక్కచేయకుండా ఈ ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ శరవేగంగా విస్తరిస్తోందని వైద్యులు వెల్లడించారు.
వ్యాప్తి రేటు ఎక్కువగా ఉండే ఈ సబ్‌వేరియెంట్ కారణంగానే కేసులు పెరిగిపోతున్నాయన్నారు. ఇక 90 శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం అధ్యయనాలు చేస్తున్నారు. యాంటీ బాడీలు ఉన్నవాళ్లతో పాటు వ్యాక్సిన్ డోసులు తీసుకున్నవాళ్లపైనా ఇది ప్రభావితం చూపిస్తోందని వైద్యులు తెలిపారు.
అయితే తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ.. వయసుపైబడిన వాళ్లపై ఇది తీవ్ర ప్రభావం చూపెట్టే అవకాశాలు ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీలో గత ఇరవై నాలుగు గంటల్లో రెండు వేలకు పైనే కేసులు నమోదు అయ్యాయి. పాజిటివిటీ రేటు 15.41 శాతంగా ఉంది. ఏడుగురు కరోనాతో మరణించగా.. ఫిబ్రవరి 6వ తేదీ తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే. దీంతో కేంద్రం.. అప్రమత్తం అయ్యింది.
ఇదీ చదవండి: చైనాలో కొత్త వైరస్.. ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment