
యువత రయ్..రయ్‌మని మోటార్ సైకిళ్లపై దూసుకు పోతుంటారు. ఇక్కడ కూడా బ్రేక్ వేయకుండా పరుగులు పెడుతుంటారు. కానీ అదే స్పీడులో ప్రమాదం జరిగితే ఇక అంతే సంగతులు. తాజాగా కెనడా పరిశోధకులు నిర్వహించిన ఓ సర్వేలో కారు ప్రమాదాల కంటే, మోటార్ సైకిల్ క్రాష్‌లే తీవ్రమైన గాయాలకు, మరణాలు, విస్తృతమైన వైద్య ఖర్చులకు కారణమవుతున్నాయని పేర్కొంది. మోటార్ సైకిల్ ప్రమాదాల ద్వారా గాయాల పాలైన 26,831 మంది పేషెంట్లు, కారు ప్రమాదాల్లో గాయపడిన 2,81,826 మంది డేటాపై రీసెర్చర్లు అధ్యయనం చేశారు. మొత్తంగా మోటార్‌సైకిల్ క్రాష్‌ల ద్వారా గాయపడిన రేటు, కారు క్రాష్‌ల ద్వారా గాయపడిన రేటు కంటే మూడింతలు ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించింది.
మోటార్‌సైకిల్ ప్రమాదాల ద్వారా అయిన దారుణమైన గాయాలు పదింతలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. మోటార్‌సైకిల్ క్రాష్‌ల సగటు వ్యయం 5,825 కెనడా డాలర్లు కాగ, కారు ప్రమాదాల వ్యయం 2,995 డాలర్లు. మోటార్‌సైకిల్ ప్రమాదాలు చాలా డేంజరస్ అని, ఇంకా చాలా ఖర్చుతో కూడుకుని ఉంటాయని సన్నీబ్రూక్ హాస్పిటల్, ది యూనివర్సిటీ ఆఫ్ టోరెంటో డాక్టర్ డానియెల్ పింకస్ తెలిపారు. 2007 నుంచి 2013 మధ్యలో మోటార్‌సైకిల్ లేదా కారు ప్రమాదాలతో ఆసుపత్రిలో ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్లలో చేరిన ఓంటారియో రెసిడెంట్ల మెడికల్ రికార్డులను పరిశోధకులు పరిశీలించారు. ఈ రెండు వాహనాల ద్వారా జరిగిన ప్రమాదాలకు మెడికల్ ఖర్చులు ఎంత అవుతున్నాయో విశ్లేషించారు.