‘రైతు’ నిరసనలు ఉధృతం
► ఎంపీ రాజధాని సమీపంలో ట్రక్కు తగులబెట్టిన రైతులు
► మంద్‌సౌర్ జిల్లాలో మరో రైతు మృతి
భోపాల్: మధ్యప్రదేశ్ మంద్‌సౌర్ జిల్లాలో చెలరేగిన రైతుల నిరసన సెగ శుక్రవారం భోపాల్‌కు చేరింది. రాజధానికి 20 కిలోమీటర్ల దూరంలోని ఫాండాలో రైతులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది.ఆందోళనకారులు ఓ ట్రక్కును తగులబెట్టి, పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జీ జరిపి 27 మందిని అరెస్టు చేశారు. వీరిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారని పోలీసులు చెప్పారు.
మరో రైతు మృతి.. హింస చెలరేగిన మంద్‌సౌర్ జిల్లాలో మరో యువ రైతు ఘనశ్యాం ధకడ్ (26) మరణించాడు. బదవన్ గ్రామానికి చెందిన అతడిని పోలీసులే కొట్టి చంపారని, ఒంటి నిండా గాయాలున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గురువారం ఘనశ్యాం గుడికి వెళుతుండగా, పోలీసులు ఆపి లాఠీలతో చితకబాదారన్నారు. అతణ్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించాడన్నారు. మృతికి కారణాలేమిటో తెలుసుకొనేందుకు దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ, కలెక్టర్ తెలిపారు.
మాజీ ఎంపీ, కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి సజ్జన్‌సింగ్ వర్మా... పోలీసులే రైతును కొట్టి చంపారని, దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మరో ముగ్గురు రైతులు అదృశ్యమయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో మంగళవారం జరిగిన హింసాత్మక ఘటనలో పోలీసుల కాల్పులకు ఐదుగురు రైతులు బలైన విషయం తెలిసిందే. రుణమాఫీ, అధిక మద్దతు ధర ఇవ్వాలన్న డిమాండ్‌తో మధ్యప్రదేశ్ పశ్చిమ ప్రాంత రైతులు ఈ నెల 1 నుంచి ఆందోళన చేస్తున్నారు.
నేటి నుంచి సీఎం చౌహాన్ నిరాహారదీక్ష
రైతు నిరసనల నేపథ్యంలో.. రాష్ట్రంలో శాంతి నెలకొనేందుకు శనివారం నుంచి దసరా మైదాన్‌లో నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని ఎంపీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రకటించా రు. రుణాలు తిరిగి చెల్లించలేని రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘రుణ పరిష్కార పథకం’ త్వరలో తేనున్నట్టు వెల్లడించారు.