
ఐదేళ్ల తర్వాత నష్టాలు ఎవరు భర్తీ చేస్తారు?
జీఎస్టీ బిల్లుపై ఎంపీ వెలగపల్లి
సాక్షి, న్యూఢిల్లీ: అనేక ప్రయోజనాలున్న జీఎస్టీ బిల్లును తేవడం ప్రశంసనీయమని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు చెప్పారు. జీఎస్టీ అమలు వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు కోల్పోయే ఆదాయాన్ని ఐదేళ్ల వరకు కేంద్రం భర్తీ చేస్తుందని చెప్పారని, ఐదేళ్ల తరువాత నష్టాలు కొనసాగితే ఎవరు భర్తీ చేస్తారని ప్రశ్నించారు. కేంద్రం సమాఖ్య స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈ విషయంమై నిర్ణయం తీసుకోవాలని కోరారు. బుధవారం జీఎస్టీ బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాల నష్టాలను భర్తీ చేసేందుకు కేంద్రం వివిధ వస్తువులపై సెస్ వేసి నిధిని తయారు చేయాలనుకుంటోందని, అయితే అది కేవలం స్వల్ప మొత్తమే అవుతుందని వరప్రసాదరావు పేర్కొన్నారు. అలాంటప్పుడు నష్టాలను ఎక్కడి నుంచి భర్తీచేస్తారని ప్రశ్నించారు.
లగ్జరీ కార్లు, పొగాకు ఉత్పత్తులపై సెస్ విధించాలనుకోవడంలో తప్పులేదని, అయితే ఆల్కహాలేతర శీతలపానీయాలపై కూడా సెస్ విధించాలనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చిన్న చిన్న రిఫ్రిజిరేటర్లు, ఏసీలపై అదనపు సెస్ విధించడం మధ్య తరగతి ప్రజలపై భారం మోపడమే అవుతుందని, ఈ అంశాన్ని పునఃపరిశీలించాలని కోరారు. జూలై 1 నుంచి జీఎస్టీ అమలును లక్ష్యంగా పెట్టుకున్నారని, అయితే అప్పటికి పరిశ్రమలు, అధికార యంత్రాంగం సంసిద్ధులై ఉండడం కష్టసాధ్యమైనందున ఈ అంశాన్ని కూడా పునః పరిశీలించాలని కోరారు.