'ఆ నలుగురు ప్రమాదకారులు'
మీరట్: ములాయం సింగ్ యాదవ్, నితీశ్ కుమార్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ దేశానికి ప్రమాదకారులు అని వివాదస్పద బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలతో విపక్షాలు బెంబేలెత్తుతున్నాయని ఎద్దేవా చేశారు. ముస్లింలకు భారత్ అత్యంత సురక్షిత ప్రాంతమని చెప్పారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో ముస్లింలే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారని తెలిపారు.
భారత్-పాకిస్థాన్ చర్చల గురించి ప్రస్తావిస్తూ... ప్రధాని మోదీ పాకిస్థాన్ తో మాట్లాడినా, మాట్లాడకపోయినా ప్రతిపక్షాలకు సమస్యగానే ఉందని చురక అంటించారు. మత అసహనం పెరిగిపోయిందని గగ్గోలు పెట్టినవారంతా బిహార్ ఎన్నికలు ముగియగానే మౌనం దాల్చారని గుర్తుచేశారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి అనుకూలంగా మధ్యప్రదేశ్ లో లక్ష మంది ముస్లింలు సంతకాలు చేశారని చెప్పారు. దేశ ప్రజలంతా రామమందిరం నిర్మించాలని కోరుకుంటుంటే వివాదం ఎక్కడుందని సాక్షి మహరాజ్ ప్రశ్నించారు.