ముంబై: ‘అనుమానాస్పదంగా’ టీ తాగితే అరెస్టు చేసేస్తారా..? ఉదయాన గానీ, మధ్యాహ్నం పూట గానీ, రాత్రివేళ గానీ టీ తాగేందుకు ఎవరైనా సంజాయిషీ ఇచ్చుకోవాలని చట్టంలో ఉన్నట్లు మాకు తెలియదు’ అంటూ బాంబే హైకోర్టు గురువారం కొల్హాపూర్ పోలీసులపై మండిపడింది. కొల్హాపూర్‌లోని రాజారామ్‌పురిలో శివాజీ యూనివర్సిటీ సమీపాన ఉన్న ఒక టీ స్టాల్‌లో విజయ్ పాటిల్ (49) అనే వ్యక్తి ‘అనుమానాస్పదంగా’ టీ తాగుతున్న పాపానికి పోలీసులు అరెస్టు చేశారు. ‘అనుమానాస్పదం’గా ఎందుకు తాగుతున్నాడో ప్రశ్నిస్తే, సరైన సమాధానం చెప్పలేదని, అందుకే అరెస్టు చేశామని పోలీసులు వినిపించిన వాదనపై హైకోర్టు ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేసింది.