నీ కళ్లు బంగారం కాను!
అమ్మాయిల అందమైన కళ్ల గురించి ఎంతో మంది కవులు ఎన్నో విధాలుగా వర్ణించారు. పాటలతో కీర్తించారు. ఇక 'తళ తళ మెరిసే ఆ బంగారు కళ్లు' అంటూ అభినవ కవి కొత్త పాట అందుకోవాల్సిందే. ఎందుకంటే ముంబైకి చెందిన ఓ డాక్టర్ అచ్చమైన బంగారంతోనే కాంటాక్టు లెన్సులు తయారు చేసి అమ్మాయిల కళ్లకు కొత్త తళుకులు తీసుకొస్తున్నారు. ముచ్చట పడిన ముద్దు గుమ్మలు ఈ బంగారు లెన్సులు ధరించాలంటే రూ. 9.30 లక్షల నుంచి రూ. 11.16 లక్షల వరకు చెల్లించాలండోయ్! 24 కారెట్ల బంగారంతో తాను తయారు చేస్తున్న ఈ కాంటాక్టు లెన్సులకు ఇప్పుడిప్పుడే గిరాకీ పెరుగుతోందని ముంబై నగరానికి చెందిన కంటి డాక్టర్ చంద్రశేఖర్ చౌహాన్ తెలిపారు.
తాను తయారు చేస్తున్న బంగారు కంటి లెన్సులను చూసి కొంత మంది వాటిని ధరించేందుకు భయపడుతుండగా ఎక్కువ మంది మక్కువ చూపిస్తున్నారని ఆయన తెలిపారు. కంటికి బంగారం అతుక్కుపోకుండా రెంటికి మధ్య తాను మరో పొరను ఏర్పాటు చేసే జాగ్రత్త తీసుకున్నానని చెప్పారు. తాను కొత్తగా వజ్రాలతో కూడా కాంటాక్ట్ లెన్సులను తయారు చేశానని, తనవద్దకొచ్చే అమ్మాయిలకు బంగారం లేదా వజ్రాల లెన్సులను ఎంచుకునే అవశాం కూడా ఉందంటున్నారు. వీటిని తాను అమెరికాలో కూడా విక్రయించాలనుకుంటున్నానని ఆయన చెప్పారు. అయితే అది అంత ఈజీ కాదు. ఈ లెన్స్‌ల వల్ల కంటి దృష్టికి ఎలాంటి హాని ఉండదని ముందుగా రుజువు కావాలని, ఆ తర్వాత అమెరికా ఫుడ్స్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అథారిటీ నుంచి అనుమతి పొందాలని నిపుణులు చెబుతున్నారు.