
గురువారం ఘట్కోపర్‌లో జనావాసాల మధ్య కుప్పకూలిన విమానం
సాక్షి, ముంబై: గురువారం మధ్యాహ్నం ఘట్కోపర్‌లో జనావాసాల మధ్య కుప్పకూలిన విమాన ప్రమాదానికి సంబంధించి సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ప్రమాదంలో మరణించిన మెయింటెన్స్ ఇంజనీర్ సురభి గుప్తా తన తండ్రితో విమానం ప్రయాణానికి అనుకూలంగా లేదని తెలిపినట్లు వెల్లడైంది. ‘మరికొద్ది గంటల్లో 12 సీట్లతో కూడిన కింగ్ ఎయిర్ సీ90 విమానంలో ప్రయాణించబోతున్నాం. కానీ, అది బాగా పాతబడి ఉంది. విమానం కండీషన్ సరిగా లేదు’ అని సురభి తనతో ఫోన్లో తెలిపిందని మృతురాలి తండ్రి ఎస్పీ గుప్తా తెలిపారు.
సురభిని ఆమె స్నేహితులు, బంధువులు కల్పనా చావ్లాగా పేర్కొనేవారని తెలిపారు. ఎంతో ధైర్య సాహసాలు గల తన కూతురు ప్రాణాలు పోవడానికి ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. సరైన కండీషన్‌లో లేని విమానానికి అనుమతులెలా ఇచ్చారని ఆయన మండిపడ్డారు. ప్రమాద ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ ప్రమాదంలో సురభితో పాటు మరో ఇంజనీర్, ఇద్దరు ఫైలట్లు, ఒక పాదచారి మరణించారు. సురభి భర్త విమాన ఫైలట్ కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment