ముంబైలో ఘోరం | Mumbai rooftop pub fire kills 14, including woman celebrating birthday | Sakshi
Sakshi News home page

ముంబైలో ఘోరం

Published Sat, Dec 30 2017 5:40 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

Mumbai rooftop pub fire kills 14, including woman celebrating birthday - Sakshi

సాక్షి, ముంబై: అది ముంబై, లోయర్‌పరేల్‌ ప్రాంతంలోని కమలామిల్స్‌ కాంపౌండ్‌లో ఉన్న ఓ భవనంలోని రూఫ్‌టాప్‌ పబ్‌ ‘1 అబవ్‌’.. సమయం రాత్రి 12 గంటలు దాటింది. అక్కడంతా సందడిగా ఉంది. ఓ బర్త్‌డే పార్టీ సందర్భంగా పండగ వాతావరణం నెలకొని ఉంది. బర్త్‌డే గర్ల్‌ ఖుష్బూ బన్సాలీ అప్పుడే కేక్‌ కట్‌ చేసి ఆత్మీయులతో పంచుకుంటోంది. క్షణాల్లో పరిస్థితి మారింది. అకస్మాత్తుగా ఎక్కడో చిన్నగా ప్రారంభమైన మంటలు.. క్షణాల్లో పబ్‌ అంతా వ్యాపించాయి. చూస్తుండగానే భవనాన్ని చుట్టుముట్టాయి.. ఓవైపు మంటలు, మరోవైపు కమ్ముకుంటున్న పొగతో పబ్‌లో భీతావహ వాతావరణం నెలకొంది. ప్రాణభయం.. హాహాకారాలు.. ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు వెళ్లే ఇరుకైన మార్గాల వద్ద తొక్కిసలాట.

మంటల నుంచి తప్పించుకునేందుకు వాష్‌రూమ్‌ల్లో దాక్కున్న వారికి పొగతో ఊపిరాడని పరిస్థితి నెలకొంది. ఈ దుర్ఘటనలో అప్పుడే పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న ఖుష్బూ సహా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 11 మంది మహిళలున్నారు. మరో 21 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌ విచారణకు ఆదేశించారు. తప్పుచేసినవారు ఎంతవారైనా వదిలిపెట్టబోమన్నారు. నలుగురు అగ్నిమాపక సిబ్బందిని సస్పెండ్‌ చేశారు. ఇదే భవనంలో ఉన్న పలు చానెళ్ల కార్యాలయ ఉద్యోగులు ప్రాణాలతో బయటపడ్డారు.

అసలేం జరిగింది?
లోయర్‌ పరేల్‌లోని కమలా మిల్స్‌ కాంపౌండ్‌లోని ఓ భవనం పై అంతస్తు రూఫ్‌టాప్‌లో 1 అబవ్‌ అనే పబ్‌ ఉంది. గురువారం రాత్రి ఖుష్బూ బన్సాలీ అనే యువతి తన 29వ పుట్టినరోజు జరుపుకునేందుకు 10 మంది స్నేహితురాళ్లతో కలిసి వచ్చారు. వేరే వాళ్లు కూడా ఇదే సమయంలో పబ్‌లో ఎంజాయ్‌ చేస్తున్నారు. సంగీతం హోరు.. అదే భవంతిలో కింద ఉన్న సంస్థల్లోకి వినబడుతోంది. ఇంతలోనే పబ్‌లో మంటలంటుకుని క్షణాల్లోనే విస్తరించాయి. మంటలు ఎగిసిపడటం, దట్టమైన పొగ వ్యాపించటంతో అక్కడున్న వారికి ఏం జరిగిందో అర్థంకాలేదు. ప్రాణాలు కాపాడుకునేందుకు తలోదిక్కు పరుగులు తీశారు. మెట్లకు దగ్గరగా ఉన్న వారు ప్రాణాలతో బయటపడ్డారు.

మిగిలిన వారు పరుగులు తీస్తుండగానే.. అగ్నికీలలు ఎగిసి పడ్డాయి. వెంటనే మూడో అంతస్తులో ఉన్న మోజో పబ్‌కూ ఈ మంటలు విస్తరించాయి. ప్రమాదం నుంచి తప్పించుకునే సమయంలో చాలా మంది అక్కడే ఉన్న టాయిలెట్స్‌లోకి వెళ్లారు. బాధితుల్లో చాలా మంది కాలిన గాయాలకంటే ఊపిరాడకే చనిపోయారని.. బాధితులను తరలించిన కింగ్‌ ఎడ్వర్డ్‌ మెమోరియల్‌ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఖుష్బూ స్నేహితురాళ్లతోపాటు ఈ వేడుకకు వచ్చిన అమెరికాకు చెందిన భారత సంతతి సోదరులిద్దరు, వారి బంధువు కూడా అగ్నికి ఆహుతయ్యారు. పబ్‌లోని వెదురుతో నిర్మించిన కనోపీ వద్ద ఘటన జరగటంతో మంటలు వేగంగా విస్తరించినట్లు తెలుస్తోంది. ప్రాణాలు కాపాడుకునేందుకు మెట్లవైపు పరుగులు తీసే క్రమంలో తొక్కిసలాట జరిగింది.

నిలువెల్లా నిర్లక్ష్యం!
ఈ భవనం మొత్తంమీద సరైన భద్రతా ప్రమాణాల్లేవు. దీనికి తోడు.. మూడు, నాలుగు అంతస్తుల్లో ఉన్న మోజో, 1 అబవ్‌ పబ్బుల నిర్వాహకులు పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది. మంటలను ఆర్పే పరికరాలు లేకపోవటంతోనే ప్రమాదం తీవ్రత పెరిగింది. కిందకు వెళ్లే అత్యవసరమార్గాలన్నీ మూసే ఉన్నట్లు తెలిసింది. ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది మరో మార్గంలో కొందరిని తరలించి ఉండకపోతే మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండేది. అటు ఇలాంటి పబ్బులపై కఠినమైన చర్యలు తీసుకోవటంలో బీఎంసీ వైఫల్యం కూడా కొట్టొచ్చినట్లు కనబడుతోంది. 1 అబవ్‌ పబ్‌కు మూడుసార్లు హెచ్చరికలు జారీ చేశామని అధికారులు చెబుతున్నారు. అధికారులకు మామూళ్లు ముడుతున్నందునే వీరిపై చర్యలు తీసుకోలేదని ముంబై వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యంగా మేల్కొన్న అగ్నిమాపక దళాలు తేరుకుని 10 ఫైరింజన్లు, 18 ట్యాంకర్లతో మంటలార్పేందుకు నాలుగు గంటలు పట్టింది.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం..
‘నేను రాత్రి షిప్టులో ఉన్నాను. పబ్‌ ఫ్లోర్‌ నుంచి అరుపులు వినిపించాయి. బయటకు వచ్చి చూడగానే 1 అబవ్‌ ఫ్లోర్‌ పూర్తిగా కాలిపోయింది. మంటల కారణంగా మా కార్యాలయం ప్రధాన ద్వారాన్ని మూసేశారు’ అని చానెల్‌ ఉద్యోగి ఒకరు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో 1 అబవ్‌ రెస్టారెంట్లో ఉన్న డాక్టర్‌ సులభా అరోరా.. ఇంకా షాక్‌నుంచి తేరుకోలేదు. తను ప్రాణాలతో బయటపడతాననుకోలేదని ఘటనను గుర్తుచేసుకుంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు.  

నిర్వాహకులపై కేసులు
1 అబవ్‌ యజమానులు హ్రతేశ్‌ సంఘ్వీ, జిగర్‌ సంఘ్వీ, అభిజిత్‌ మకా సహా పలువురిపై ఐసీపీ 337 (ఇతరుల భద్రతను, ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం), 338 (తీవ్ర నష్టాన్ని కలిగిస్తూ ప్రాణాలకు హాని కల్గించటం) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కేసు నమోదైన వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

కలసిరాని ‘29’
ముంబై: దేశ ఆర్థిక రాజధానికి 29వ తేదీ కలిసిరాలేదు. ఈ ఏడాదిలో 29వ తేదీన మూడు ఘోర ప్రమాదాలు ముంబైని వణికించాయి. ఆగస్టు 29న కుండపోత వర్షం కురవడంతో ముంబైలోని రవాణా మార్గాలన్నీ స్తంభించిపోయాయి. ఈ వర్షాలకు దాదాపు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. నెలరోజుల తర్వాత మళ్లీ 29వ తేదీనే ముంబైలోని ఎల్ఫిన్‌స్టోన్‌ రోడ్డు– పరేల్‌ రైల్వేస్టేషన్‌లను కలిపే పాదచారుల బ్రిడ్జీపై జరిగిన తొక్కిసలాటలో 23 మంది చనిపోయారు. తాజాగా డిసెంబర్‌ 29న 1 అబవ్‌ పబ్‌ అగ్ని ప్రమాదంలో 14 మంది దుర్మరణం చెందారు.

29న 29 ఏళ్లకే..
1 అబవ్‌ పబ్‌లో సంగీతాన్ని ఆస్వాదిస్తూ కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఖుష్బూ చాకోలెట్‌ కేక్‌ను కట్‌చేసింది. ఖుష్బూ వీడియాను ఆమె స్నేహితులు ఫేస్‌బుక్‌లో ఉంచారు. ‘హ్యాపియెస్ట్‌ బర్త్‌డే ఖుష్బూ’ అని క్యాప్షన్‌ జతచేశారు. కానీ విధి వక్రించింది. కొన్ని క్షణాలకే పబ్‌ను మంటలు చుట్టుముట్టాయి. ఇందులో ఖుష్బూ సహా 14 మంది చనిపోయారు.

సెల్ఫీలు, మద్యంతో పెరిగిన తీవ్రత
పబ్‌లో మంటలు చెలరేగినప్పుడు అతిథుల్లో కొందరు సెల్ఫీలు తీసుకుంటూ, మరికొందరు తప్పతాగి ఉండటంతో సహాయక చర్యలు ఆలస్యమయ్యాయని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఈ భవన సెక్యూరిటీగాఉన్న  మహేశ్‌ సబ్లే మాట్లాడుతూ..‘రాత్రి 12.30 సమయంలో పెద్దఎత్తున గందరగోళం చెలరేగడంలో నేను టెర్రస్‌పైనున్న ఆఫీస్‌ నుంచి బయటికొచ్చాను. తీవ్ర ఆందోళనలతో ఉన్న ప్రజలు నావైపు పెద్దసంఖ్యలో దూసుకొచ్చారు. దీంతో 150 నుంచి 200 మందికి కిందకు వెళ్లడానికి దారిచూపించాను. వీరందర్ని కిందకు పంపాక టాయిలెట్లలో ఉండిపోయిన మరో 10 మందిని బయటకు తీసుకొచ్చాను. వీరందరికీ స్వల్పంగా కాలిన గాయాలయ్యాయి. మంటలు ఎక్కువ కావడంతో మరోసారి నేను లోపలకు వెళ్లలేకపోయాను’ అని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement