ముంబైలోని కుర్లాలో జరిగిన అగ్నిప్రమాదం (ఫైల్ ఫొటో)
సాక్షి, ముంబై : విద్యుత్ పరికరాల నిర్వహణలో అలసత్వం, నిర్లక్ష్యం వల్ల దేశంలో ఏటా జరుగుతున్న అగ్ని ప్రమాదాల్లో దేశ రాజధాని న్యూఢిల్లీ తొలి స్థానంలో నిలిచింది. అగ్ని ప్రమాదాల్లో దేశ ఆర్థిక రాజధాని ముంబై రెండో స్థానంలో నిలువగా.. అహ్మదాబాద్ మూడవ స్థానంలో నిలిచింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజాగా ప్రకటించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
గత పదేళ్ల కాలంలో షార్ట్-సర్క్యూట్‌తో జరిగిన అగ్నిప్రమాదాల వల్ల ఢిల్లీలో 424 మంది, ముంబైలో 418 మంది, అహ్మదాబాద్‌లో 260 మంది ప్రాణాలు కోల్పోయారు. 2006 నుంచి 2015 మధ్య కాలంలో దేశంలో సంభవించిన అగ్ని ప్రమాదాల వివరాలను నివేదిక వివరించింది. మాజీ అగ్నిమాపక దళాధిపతి పీడీ కర్గూపికర్ మాట్లాడుతూ.. నామమాత్రపు చర్యలతో అగ్ని ప్రమాదాల్ని ఆపలేమన్నారు.
ఇంజనీర్లతో ఎలక్ట్రికల్ ఆడిట్‌లు నిర్వహిస్తేనే సమస్యలకు కొంతమేర పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రమాదం జరిగినప్పుడు మంటల్లో విలువైన ఆధారాలు ఎన్నో నష్టపోతామన్నారు. మంటలార్పే క్రమంలో నీటి ధాటికి మిగిలిన ఆధారాలు కూడా లభించవన్నారు. తద్వారా ప్రమాదానికి షార్ట్-సర్క్యూట్ కారణమా..? లేక మరేదైనా కారణమా? అనేది తేల్చడం కష్టమౌతుందన్నారు.
ప్రధాన అగ్నిమాపక అధికారి పీ.ఎస్.రహంగ్‌దలే మట్లాడుతూ... నాణ్యమైన విద్యుత్ పరికరాలు వాడకపోవడం వల్లే షార్ట్-సర్క్యూట్ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. వైరింగ్ లోపం వల్ల, ఓవర్‌లోడ్ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం అధికమవుతుందన్నారు.
భవనాలు, అపార్ట్‌మెంటుల్లోని చెత్త చాలా రోజుల పాటు అలాగే పెట్టేస్తారు. దాంతో చిన్నపాటి అగ్ని ప్రమాదం కూడా తీవ్ర రూపం దాలుస్తుందన్నారు. ప్రమాదం నుంచి బయటపడే మార్గం లేక.. వెలువడిన పొగ, విష వాయువుల్ని పీల్చడం వల్ల మృతుల సంఖ్య పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment