ప్రాణాలు తీసిన ఫొటోలు
ముంబై: మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లాలోని మురూద్-జంజీరా తీరంలో సోమవారం సముద్రంలో మునిగి 14 విద్యార్థులు మృతి చెందిన విషాదకర ఘటనకు ఫొటోలు, సెల్ఫీ కారణమని తెలుస్తోంది. తమ స్నేహితులు ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటుండగా ఒక్కసారిగా కెరటాలు ఎగసిపడడంతో కొట్టుకుపోయారని ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన విద్యార్థిని తెలిపింది.
పెద్ద కెరటాలు సముద్రం లోపలికి లాక్కుపోయిందని చెప్పింది. వీరిని రక్షించేందుకు పలువురు సముద్రంలోకి దూకారని తెలిపింది. వాహనాలు అందుబాటులో లేకవడంతో ఎడ్ల బండ్లు, గుర్రపు బళ్లలో బాధితులను ఆస్పత్రికి తరలించారని వెల్లడించింది. దేవుడి దయతో తాను, తన స్నేహితులు ప్రాణాలతో బయటపడ్డామని చెప్పింది. తనను బతికించినందుకు దేవుడిని ధన్యవాదాలు తెలిపింది.
పుణేలోని ఇనాందార్ కాలేజీలో బీఎస్సీ, బీసీఏ చదువుతున్న 116 మంది విద్యార్థులు మురూడ్-జంజీరాకు మూడు బస్సుల్లో వచ్చారు. వీరిలో కొందరు.. ఉపాధ్యాయులకు తెలియకుండా మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఈత కోసం సముద్రంలోకి దిగారు. అదే సమయంలో భారీ అలలు రావడంతో నీట మునిగి కొట్టుకుపోయారు. దీంతో 14 మంది విద్యార్థులు మృతి చెందారు.