రగులుతున్న ఉమ్మడి పౌరస్మృతి
‘ఉమ్మడి’ని వ్యతిరేకించిన ముస్లిం పర్సనల్ లా బోర్డు
► న్యాయశాఖ ప్రశ్నావళిని బహిష్కరిస్తున్నట్లు ప్రకటన
► సంస్కరణలు అవసరం.. చర్చలకు సిద్ధం: మైనారిటీ శాఖ మంత్రి నఖ్వీ
► భారత్‌లో ‘ఉమ్మడి’ సాధ్యం కాదన్న కాంగ్రెస్
► రాజకీయ లబ్ధికోసమే తెరపైకి ఈ నిర్ణయం: విపక్షాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి పౌరస్మృతిపై దుమారం మొదలైంది. దేశవ్యాప్తంగా వివాహచట్టంలో ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెట్టడానికి చేస్తున్న కసరత్తుపై కేంద్రానికి ఆదిలోనే తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతోంది. ఉమ్మడి పౌరస్మృతి, ట్రిపుల్ తలాక్‌లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (ఏఎల్‌ఎంపీఎల్‌బీ), ముస్లిం సంస్థలు తేల్చి చెప్పాయి. దీన్ని అమలుచేయటం సాధ్యం కాదని కాంగ్రెస్ తెలపగా.. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని జేడీయూ విమర్శించింది. ఈ విషయంలో ప్రభుత్వ వ్యతిరేక వైఖరిపై ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి.
ఉమ్మడి పౌరస్మృతిపై ప్రజలు, సంఘాల సూచనల కోసం కేంద్ర న్యాయశాఖ రూపొందించిన ప్రశ్నావళిని బహిష్కరిస్తున్నట్లు స్పష్టం చేశాయి. ‘దేశప్రజలందరికీ ఒకే గాటన కట్టడం సరికాదు. దీనివల్ల దేశ బహుళత్వం, భిన్నత్వాలు ప్రమాదంలో పడతాయి. మిగిలిన మతాలతోపోలిస్తే మాదగ్గర విడాకులు తీసుకోవటం చాలా తక్కువ’ అని బోర్డు జనరల్ సెక్రటరీ మౌలానా మహమ్మద్ వలీ రహమనీ తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే.. మోదీ ఈ విధానాల రూపకల్పన విషయాన్ని లేవనెత్తారని ఆయన విమర్శించారు. వివిధ ముస్లిం సంస్థలు.. దీనిపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జమాతే ఉలేమాయీ హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ వెల్లడించారు. ప్రభుత్వం దీనిపై వెనక్కు తగ్గకపోతే.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.
చర్చలకు సిద్ధం: నఖ్వీ
దీనిపై అన్ని వర్గాలతో కలిసి చర్చించేందుకు తలుపులు తెరిచే ఉన్నాయని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి నఖ్వీ తెలిపారు. సంస్కరణలపై చర్చలు జరపకుండానే ముందస్తుగానే నిర్ణయానికి వచ్చేయటం సరికాదన్నారు. ఉమ్మడి పౌరస్మృతి ప్రగతిశీల నిర్ణయమని బీజేపీ చెబుతున్నా.. ఈ నిర్ణయాన్ని అమలు చేయటం అసంభవమని.. భారత దేశంలో ఉమ్మడిపౌరస్మృతి అమలు సాధ్యం కాదని మాజీ న్యాయ శాఖ మంత్రి వీరప్పమొయిలీ తెలిపారు. ఉమ్మడి పౌరస్మృతితో దేశంలో భిన్నత్వం దెబ్బతింటుందని మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు.