'నా చాయ్ అంత స్ట్రాంగ్గా నిర్ణయాలుంటాయ్'
ఘాజిపూర్: మాములుగానే మంచి మాటకారి అయిన ప్రధాని నరేంద్రమోదీ మరోసారి తన సభకు వచ్చిన ప్రజలను తన వాక్చాతుర్యంతో కట్టిపడేశారు. పంచ్ డైలాగ్లు విసరడంతో వారంతా సందడి చేశారు. సోమవారం బీజేపీ పరివర్తన ర్యాలీ సందర్భంగా మాట్లాడిన మోదీ తాను చాయ్ అమ్మిన రోజులు గుర్తు చేసుకున్నారు. తన నిర్ణయాలు కూడా తన చాయ్ అంత స్ట్రాంగ్గా ఉంటాయని అన్నారు. ఈ మాట వినగానే సభ ముందు ఉన్నవారంతా మోదీ మోదీ అంటూ బిగ్గరగా కేకలు వేశారు.
'నేను చిన్న పిల్లాడిలా ఉన్న రోజుల్లో చాయ్ మరింత్ స్ట్రాంగ్గా తయారు చేయమని కోరేవారు.. ఇప్పుడు నా నిర్ణయాలు కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంటాయి. నేను రైల్వే ఫ్లాట్ ఫాంలపై చాయ్లు అమ్మేవాడిని' అని మోదీ బహిరంగ సభలో చెప్పారు. రూ.2.5లక్షలు జమ చేసేవారిని అధికారులు ఏమీ అనబోరని, కానీ, 2.5కోట్లు ఉన్నవారిని మాత్రం వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. వారు తమ మంచాల పరుపుల కింద దాచినా వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
అంతకుముందు దేశం కోసం పోరాటం చేయడానికి గర్వపడుతున్నానని మోదీ అన్న విషయం తెలిసిందే. నోట్ల రద్దు నిర్ణయానికి సామాన్యులు సహకరిస్తుంటే.. నల్ల కుబేరులు మాత్రం నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దుతో పేదలు ప్రశాంతంగా నిద్రపోతున్నారని అన్నారు. అయితే నోట్ల రద్దుతో ఆదాయపన్ను ఎగ్గొట్టేవారు నిద్రమాత్రలు వేసుకుంటున్నారని, అవినీతిపరులే ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.