
'నా పరువు గంగలో కలిపేశారు'
తన పరువంతా గంగలో కలిపేశారని, రికార్డు సర్వనాశనం చేశారని.. అసలు ఇంత చేయడం ఎందుకని విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి సుజాతాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. పదవీ విరమణ చేయడానికి ఇంకా ఏడునెలల గడువు ఉండగానే ఆమెను ఆ పదవి నుంచి తప్పించి, అమెరికా మాజీ రాయబారి సుబ్రహ్మణ్యం జైశంకర్ను నియమించిన విషయం తెలిసిందే. అయితే.. ఇదంతా చాలా దారుణమైన పద్ధతిలో చేశారని సుజాతా సింగ్ అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై తాను సోషల్ మీడియాలో చెబుతానని అన్నారు.
గత సంవత్సరమే తనను కావాలంటే వెళ్లిపోవచ్చని చెప్పారని కూడా తాజాగా ఆమె వెల్లడించారు. కావాలంటే మూడు లేదా ఐదేళ్ల పాటు రాజ్యాంగ పదవి ఏదైనా ఇస్తామన్నారని, కానీ తాను అధికారిణిగానే సేవలు అందించాలని భావించడంతో ఆ ఆఫర్ నిరాకరించానని చెప్పారు. తాను గౌరవప్రదంగా వెళ్లాలనుకున్నానని, కానీ చాలా నీచమైన పద్ధతిలో బయటకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు.