విదేశాంగ కార్యదర్శిగా తన పదవీ కాలం ముగియటానికి ముందుగానే పదవీ విరమణ కావాలని తాను కోరినట్లు సుజాతాసింగ్ పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: విదేశాంగ కార్యదర్శిగా తన పదవీ కాలం ముగియటానికి ముందుగానే పదవీ విరమణ కావాలని తాను కోరినట్లు సుజాతాసింగ్ పేర్కొన్నారు. వ్యవస్థ కన్నా ఏ వ్యక్తీ అధికం కాదని ఆమె వ్యాఖ్యానించారు. విదేశాంగ కార్యదర్శి పదవి నుంచి ప్రభుత్వం తనను అర్ధంతరంగా తొలగించిన నేపథ్యంలో.. సుజాతాసింగ్ తన సహ ఐఎఫ్‌ఎస్ అధికారులకు వీడ్కోలు ఈ-మెయిల్ సందేశం పంపించారు.
ఇందులో తన తొలగింపు విషయాన్ని ఆమె ప్రస్తావించలేదు. అయితే.. 38 ఏళ్ల ప్రభుత్వ సర్వీసు తర్వాత తాను ముందస్తుగా పదవీ విరమణ కోరుకున్నానని పేర్కొన్నారు. సంస్థల నిర్మాణంలో వ్యక్తులు కీలక పాత్ర పోషించినప్పటికీ.. సంస్థలే కీలకమని.. సంస్థలు ఒక దానితో ఒకటి ఎలా సమన్వయం చేసుకుంటాయనేది ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. భారత విదేశాంగ శాఖలో 38 ఏళ్ల పాటు పనిచేయటం తనకు లభించిన విశిష్ట అవకాశమని.. గత 18 నెలల పాటు విదేశాంగ కార్యదర్శిగా పనిచేయటం తనకు జీవితాంతం గర్వంగా గుర్తుండిపోతుందని చెప్పారు.