Sujatha Singh
-
ఒక దెబ్బకు రెండు పిట్టలు!
-
'నా పరువు గంగలో కలిపేశారు'
తన పరువంతా గంగలో కలిపేశారని, రికార్డు సర్వనాశనం చేశారని.. అసలు ఇంత చేయడం ఎందుకని విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి సుజాతాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. పదవీ విరమణ చేయడానికి ఇంకా ఏడునెలల గడువు ఉండగానే ఆమెను ఆ పదవి నుంచి తప్పించి, అమెరికా మాజీ రాయబారి సుబ్రహ్మణ్యం జైశంకర్‌ను నియమించిన విషయం తెలిసిందే. అయితే.. ఇదంతా చాలా దారుణమైన పద్ధతిలో చేశారని సుజాతా సింగ్ అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై తాను సోషల్ మీడియాలో చెబుతానని అన్నారు. గత సంవత్సరమే తనను కావాలంటే వెళ్లిపోవచ్చని చెప్పారని కూడా తాజాగా ఆమె వెల్లడించారు. కావాలంటే మూడు లేదా ఐదేళ్ల పాటు రాజ్యాంగ పదవి ఏదైనా ఇస్తామన్నారని, కానీ తాను అధికారిణిగానే సేవలు అందించాలని భావించడంతో ఆ ఆఫర్ నిరాకరించానని చెప్పారు. తాను గౌరవప్రదంగా వెళ్లాలనుకున్నానని, కానీ చాలా నీచమైన పద్ధతిలో బయటకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. -
ముందస్తు పదవీ విరమణ కోరాను: సుజాతాసింగ్
న్యూఢిల్లీ: విదేశాంగ కార్యదర్శిగా తన పదవీ కాలం ముగియటానికి ముందుగానే పదవీ విరమణ కావాలని తాను కోరినట్లు సుజాతాసింగ్ పేర్కొన్నారు. వ్యవస్థ కన్నా ఏ వ్యక్తీ అధికం కాదని ఆమె వ్యాఖ్యానించారు. విదేశాంగ కార్యదర్శి పదవి నుంచి ప్రభుత్వం తనను అర్ధంతరంగా తొలగించిన నేపథ్యంలో.. సుజాతాసింగ్ తన సహ ఐఎఫ్ఎస్ అధికారులకు వీడ్కోలు ఈ-మెయిల్ సందేశం పంపించారు. ఇందులో తన తొలగింపు విషయాన్ని ఆమె ప్రస్తావించలేదు. అయితే.. 38 ఏళ్ల ప్రభుత్వ సర్వీసు తర్వాత తాను ముందస్తుగా పదవీ విరమణ కోరుకున్నానని పేర్కొన్నారు. సంస్థల నిర్మాణంలో వ్యక్తులు కీలక పాత్ర పోషించినప్పటికీ.. సంస్థలే కీలకమని.. సంస్థలు ఒక దానితో ఒకటి ఎలా సమన్వయం చేసుకుంటాయనేది ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. భారత విదేశాంగ శాఖలో 38 ఏళ్ల పాటు పనిచేయటం తనకు లభించిన విశిష్ట అవకాశమని.. గత 18 నెలల పాటు విదేశాంగ కార్యదర్శిగా పనిచేయటం తనకు జీవితాంతం గర్వంగా గుర్తుండిపోతుందని చెప్పారు. -
మోదీ వివరణ ఇవ్వాలి: కాంగ్రెస్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటన ముగిసిన తక్షణమే.. కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి పదవి నుంచి సుజాతాసింగ్‌ను కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కారణం లేకుండా ఆకస్మికంగా, అర్థంతరంగా తొలగించటంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు వివరణ ఇవ్వాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ‘‘అత్యంత సీనియర్ అయిన మహిళా విదేశాంగ సేవల అధికారిని మోదీ ప్రభుత్వం ఆకస్మికంగా, అర్థంతరంగా తొలగించటం.. ఆ ప్రభుత్వపు ఉద్దేశం, అది అనుసరిస్తున్న పరిపాలనా విధానాలపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది’’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌సుర్జేవాలా గురువారం ఢిల్లీలో మీడియాతో పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఇంతకుముందు ఆర్థికశాఖ కార్యదర్శిని కూడా ఇలాగే తొలగించారని.. ఇది మోదీ నియంతృత్వ పోకడలకు అద్దంపడుతోందని కాంగ్రెస్ మరో అధికార ప్రతినిధి ఆనంద్‌శర్మ ధ్వజమెత్తారు. -
వేటు వెనుక..?
*ప్రధాని అసంతృప్తే కారణం! భారత విదేశాంగ శాఖ కార్యదర్శి పదవి నుంచి సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి సుజాతాసింగ్‌ను అర్ధంతరంగా తొలగిం చటం వెనుక కారణాలేమిటి? అనేది ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. సుజాతాసింగ్ తొలగింపు అర్ధాంతరమే అయినప్పటికీ.. ఆకస్మిక నిర్ణయమేమీ కాదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఆమె పనితీరుపై ప్రధానమంత్రి మోదీ ఆరంభం నుంచీ అసంతృప్తిగానే ఉన్నారని.. ఆమెను ఆ పదవి నుంచి తొలగించాలని ఆయన కొంత కాలం కిందే భావించినప్పటికీ.. ఆమెను కొనసాగించాలని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ కోరటంతో ఈ వ్యవహారాన్ని కొంత కాలం వాయిదా వేసినట్లు సమాచారం. అలాగే.. అమెరికాలో భారత రాయబారిగా ఉన్న జైశంకర్‌ను విదేశాంగ కార్యదర్శిగా నియమించాలని కూడా ప్రధాని కొంత కాలం కిందటే నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అయితే.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటన ముగిసే వరకూ జైశంకర్‌ను అమెరికా రాయబారిగా కొనసాగించాలని ఆయన భావించారని.. అందుకే ఒబామా పర్యటన ముగిసే వరకూ వేచివున్నారని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. సుజాతాసింగ్ తొలగింపు, జైశంకర్ నియామకం వ్యవహారానికి సంబంధించి పలు ఆసక్తికరమైన అంశాలివీ... * సుజాతాసింగ్ 1976 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి. ఆమె భారత్ పొరుగు దేశాల్లో ఏ దేశంలోనూ రాయబారిగా పనిచేయలేదు. ఆమె2013 ఆగస్టులో విదేశాంగ శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. వాస్తవానికి ఆ సమయంలోనే సీనియారిటీలో ముందున్న సుజాతాసింగ్‌ను కాదని.. అమెరికాలో భారత రాయబారిగా ఉన్న ఎస్.జైశంకర్‌ను విదేశాంగ కార్యదర్శిగా నియమించాలని అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ భావించారు. అయితే.. నాటి అధికార పార్టీ అయిన కాంగ్రెస్ నాయకత్వం అందుకు నిరాకరించటంతో.. సుజాతాసింగ్నే ఆ పదవిలో నియమించారు. సుజాతాసింగ్.. ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్, ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ అయిన టి.వి.రాజేశ్వర్ కుమార్తె. ఆయనను కాంగ్రెస్ పార్టీ విధేయుడిగా పరిగణించేవారని.. యూపీఏ హయాంలో సుజాతాసింగ్‌ను విదేశాంగ శాఖ కార్యదర్శిగా నియమించటానికి ఆ అంశం కూడా చూపిందని అంటారు. * సుజాతాసింగ్ కన్నా జైశంకర్ ఒక ఏడాది జూనియర్. రక్షణ రంగ వ్యూహకర్త కె.సుబ్రమణ్యం కుమారుడైన జైశంకర్ 1977 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి. జైశంకర్‌కు పొరుగు దేశమైన చైనాలో అత్యధిక కాలం భారత రాయబారిగా పనిచేసిన అధికారిగా రికార్డు ఉంది. సింగపూర్, చెక్ రిపబ్లిక్లలో కూడా ఆయన భారత రాయబారిగా పనిచేశారు. అంతర్జాతీయ సంబంధాలు, అందునా అణు దౌత్యంలో పీహెచ్డీ చేసి డాక్టరేట్ పొందిన జైశంకర్.. ఏడేళ్ల కిందట భారత్, అమెరికాల మధ్య అణు ఒప్పందం కుదరటంలో పోషించిన పాత్ర కారణంగా ఆయనను విదేశాంగ కార్యదర్శిగా నియమించాలని నాడు మన్మోహన్ భావించినట్లు ఉన్నతస్థాయి వర్గాలు వివరించాయి. * ఇక.. సుజాతాసింగ్ విదేశాంగ కార్యదర్శిగా ఉన్నపుడు అమెరికా - భారత్‌ల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించాయి. ముఖ్యంగా అమెరికాలో జూనియర్ దౌత్యాధికారిగా పనిచేస్తున్న దేవయాని ఖోబ్రాగడెను వీసా అక్రమాల ఆరోపణలపై అమెరికా పోలీసులు అరెస్ట్ చేయటంతో ఇరు దేశాల సంబంధాలు ఒడిదుడుకులకు లోనయ్యాయి. * మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆ రాష్ట్రంలో జరిగిన మత హింస నేపథ్యంలో ఆయనకు పదేళ్ల పాటు వీసా నిరాకరించిన అమెరికా వైఖరిలో మార్పు వచ్చేందుకు.. ప్రధానిగా మోదీ అమెరికా పర్యటన విజయంతం అయ్యేందుకు.. ఆ తర్వాత భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యేలా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను ఒప్పించటంలో జైశంకర్ దిగ్విజయంగా కృషి చేశారని.. ఆయన విదేశాంగ కార్యదర్శిగా ఉండటం వల్ల ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని మోదీ భావించారు. * అమెరికాలో భారత రాయబారిగా ఉన్న డాక్టర్ సుబ్రమణ్యం జైశంకర్ ఈ నెల 31వ తేదీన పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే.. ఆయన పదవీ కాలం ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో.. ఆయనను భారత విదేశాంగ కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విదేశాంగ కార్యదర్శిని అర్థంతరంగా తొలగించటం ఇది రెండోసారి. 1987లో అప్పటి విదేశాంగ కార్యదర్శి ఎ.పి.వెంకటేశ్వరన్‌ను నాటి ప్రధాని రాజీవ్ తొలగించారు. - సెంట్రల్ డెస్క్ -
సుజాతకు స్వయంగా ఫోన్ చేశా: సుష్మ
న్యూఢిల్లీ: విదేశాంగ నూతన కార్యదర్శిగా డాక్టర్ జయశంకర్ ను నియమించిన విషయాన్ని సుజాతా సింగ్ కు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్వయంగా సమాచారం అందించారు. తాను స్వయంగా సుజాతా సింగ్ తో మాట్లాడినట్టు సుష్మా స్వరాజ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. విదేశాంగ కార్యదర్శిగా జయశంకర్ ను ప్రభుత్వం నియమించాలని కోరుకుందని ఆమెతో చెప్పినట్టు తెలిపారు. జయశంకర్ ఈనెల 31న రిటైర్ అవుతున్నందున ఈలోపు విదేశాంగ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాలని ఆదేశించామని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలతో గురువారం ఆయన విదేశాంగ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. సుజాతా సింగ్ ను తొలగించి జయశంకర్ ను నియమించడంతో సుష్మా స్వరాజ్ అసంతృప్తిగా ఉన్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. -
విదేశాంగ కార్యదర్శి సుజాత సింగ్‌పై వేటు
-
'జైశంకర్ నియామకంలో రాజకీయ ఉద్దేశ్యం లేదు'
న్యూఢిల్లీ: ప్రభుత్వ ప్రాధాన్యాలే తన ప్రాధాన్యాలని భారత విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్ స్పష్టం చేశారు. గురువారం న్యూఢిల్లీలోని భారత విదేశాంగ శాఖ కార్యాలయంలో ఆయన నూతన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా కార్యాలయంలోని ఉన్నతాధికారులు, సిబ్బంది ఎస్.జైశంకర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాలో భారత రాయబారిగా పనిచేస్తున్న ఎస్.జైశంకర్‌ను భారత విదేశాంగ కార్యదర్శిగా నియమించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన నియామకాలపై మంత్రివర్గ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆ వెంటనే ఆదేశాలు జారీ కావడం.... జైశంకర్ బాధ్యతలు స్వీకరించడం అంతా చకచకా జరిగిపోయాయి. అయితే విదేశాంగ కార్యదర్శిగా ఉన్న సుజాతాసింగ్ పదవీ కాలం ఇంకా 8 నెలలు మిగిలి ఉండగానే ఆ పదవి నుంచి ఆమెను తప్పించారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా పర్యటన మరుసటి రోజే ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నారు.... సుజాతా సింగ్‌ను ఆ పదవి నుంచి అమర్యాదగా తప్పించారని కాంగ్రెస్ పార్టీ.. మోదీ ప్రభుత్వంపై ఆరోపణలు సంధించింది. దాంతో కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఈ నియామకాల్లో రాజకీయ ఉద్దేశ్యం లేదని బీజేపీ స్పష్టం చేసింది. -
'దేవయాని ఉదంతం ముగిసిన అధ్యాయం కాదు'
న్యూఢిల్లీ: దౌత్యవేత్త దేవయాని ఖోబ్రాగదే ఉదంతాన్ని ముగిసిన అధ్యాయంగా పరిగణించడానికి భారత్ అంగీకరించలేదు. ఈ విషయంపై ఇంకా పరిష్కారం కావాల్సిన అంశాలున్నాయని విదేశాంగ కార్యదర్శి సుజాతా సింగ్ తెలిపారు.న్యూయార్క్ లోని భారత కాన్సులేట్ లో దౌత్యవేత్తగా పనిచేస్తున్న దేవయానిపై వీసా మోసం, తప్పుడు సమాచారం కింద అమెరికా ప్రభుత్వం కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలపై ప్రభావం పడింది. అయితే దీన్ని ముగిసిన అధ్యాయంగా అమెరికా ప్రభుత్వం వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా?అన్న ప్రశ్నకు సుజాతా సింగ్ పై విధంగా బదులిచ్చారు. ఆ అభిప్రాయాలతో తాము ఏకీభవించడం లేదని సుజాతా సింగ్ తెలిపారు.