
న్యూఢిల్లీ : శ్రీలంకలో ఉన్న తమిళ మైనారిటీల పట్ల ఆ దేశ ప్రభుత్వం సమానత్వం, న్యాయం, గౌరవం చూపిస్తుందన్న విశ్వాసం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భారత పర్యటనకు వచ్చిన శ్రీలంక ప్రధాని మహిందా రాజపక్సతో మోదీ శనివారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఉగ్రవాదం, ఆర్థిక వ్యవహారాలు, పర్యాటకం తదితర అంశాలపై ఇరు దేశాల ప్రధానులు చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ...'భారత్, శ్రీలంకలు రెండు కేవలం పక్కపక్కన ఉండే దేశాలు మాత్రమే కాదని, ఎప్పటికి మంచి స్నేహితులుగా కలిసి ఉంటాయి. శ్రీలంక అభివృద్ధికి భారత ప్రభుత్వం ఎప్పుడు కట్టుబడే ఉంటుంది. మన ప్రాంతంలో ఉగ్రవాదం సమస్య ఎక్కువగా ఉంది. రెండు దేశాలు కలిసికట్టుగా ఉగ్రవాదంపై పోరాడాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు సహకారాన్ని పెంచుకోవాలి. గతేడాది ఏప్రిల్‌లో ఈస్టర్ రోజున శ్రీలంకలో చర్చిలపై ఉగ్రవాదులు బాంబు దాడి చేయడం బాధాకరం. ఈ దాడులు ఒక్క శ్రీలంకకే కాదు.. మొత్తం మానవాళికి బాధ కలిగించే విషయం' అని మోదీ పేర్కొన్నారు.
కాగా భారత పర్యటనలో భాగంగా రాజపక్స ఆదివారం ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న కాశీ శైవక్షేత్రాన్ని సందర్శించనున్నారు. ఫిబ్రవరి 10వ తేదిన బీహార్‌లోని గయాలోని బౌద్దుని సందర్శించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment