
ఉగ్ర పంథా వీడితేనే చర్చలు
శాంతి మార్గంలో పాక్ కూడా నడవాల్సిందే
• కీలక విషయాల్లో చైనా, భారత్‌లు సున్నితంగా వ్యవహరించాలి
• రైసినా చర్చల ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ
• అమెరికా, రష్యా, గల్ఫ్ దేశాలతో సంబంధాల్ని ప్రస్తావించిన మోదీ
న్యూఢిల్లీ: చర్చల ప్రక్రియ తిరిగి మొదలవ్వాలంటే... పాకిస్తాన్ ఉగ్ర పంథాను వీడాలని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. పొరుగు దేశాలతో సత్ససంబంధాలనే భారత్ కొరుకుంటోందని, దక్షిణాసియాలో శాంతి, సామరస్యం వెల్లివిరియాలన్నదే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. మూడు రోజులపాటు జరిగే ‘రైసినా చర్చల’ ప్రారంభోత్సవంలో మోదీ మంగళవారం ప్రసంగించారు. ఈ శతాబ్దం ఆసియాదేనని ఆయన పేర్కొన్నారు. భారత్ విదేశాంగ ప్రాధమ్యాలు, హిందూ మహాసముద్రంలో భద్రతా ప్రయోజనాలు, పొరుగు దేశాలతో పాటు గల్ఫ్, అమెరికా, చైనా, రష్యాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని మాట్లాడారు. ‘భారత్ ఒక్కటే ఒంటరిగా శాంతి మార్గంలో పయనించలేదు. పాకిస్తాన్ సైతం కలిసి నడవాలి. భారత్‌తో చర్చల దిశగా పాకిస్తాన్ సాగాలనుకుంటే ఉగ్రబాటను విడిచిపెట్టాలి’ అని పేర్కొన్నారు.
పాకిస్తాన్‌తో సంబంధాలు సాధారణ స్థితికి చేరుకునేందుకు తాను తీసుకున్న చొరవను ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేసుకున్నారు. శాంతి నెలకొల్పే ఉద్దేశంతోనే లాహోర్‌కు వెళ్లానని చెప్పారు. మంచి, చెడు ఉగ్రవాదాలంటూ కృత్రిమ భేదాలు చూపడం సరికాదని పేర్కొన్నారు. ‘ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, ఎగుమతి చేస్తూ, విద్వేషాల్ని రెచ్చగొడుతూ మన పొరుగు దేశం ప్రపంచంలో ఏకాకి అయ్యింది’ అని అన్నారు. ఇరుగు పొరుగు దేశాల మధ్య సత్ససంబంధాలు నెలకొనాలనే ఉద్దేశంతో తన ప్రమాణ స్వీకారోత్సవానికి సార్క్ దేశాధిపతులను ఆహ్వానించానని వెల్లడించారు.
ఇరుగుపొరుగు మధ్య విభేదాలు సహజం
చైనాతో సంబంధాలపై మాట్లాడుతూ.. రెండు పెద్ద పొరుగు దేశాల మధ్య కొన్ని అభిప్రాయ బేధాలు ఉండడం సహజమేనని, అయితే ఇరు వర్గాలు కీలక అంశాల్లో సున్నితంగా వ్యహరించాలని, ఒకరి ఆందోళనలు, ప్రయోజనాల్ని మరొకరు గౌరవించుకోవాలన్నారు. ‘భారత్, చైనాలు అభివృద్ధి చెందడం ఇరు దేశాలకే కాకుండా మొత్తం ప్రపంచానికే అపూర్వమైన అవకాశంగా నేను భావిస్తున్నా’ అని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యంలో భాగంగా విస్తృతమైన వాణిజ్య, వ్యాపార అవకాశాల్ని వినియోగించుకోవాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, తాను విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
అఫ్గాన్‌కు అండగా..
అఫ్గానిస్తాన్ భౌగోళికంగా భారత్‌కు దూరంగా ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆ దేశ పునర్నిర్మాణంలో భారత్ భాగస్వామిగా వ్యవహరించిన అంశాల్ని మోదీ ప్రస్తావించారు. అఫ్గానిస్తాన్ పార్లమెంట్ భవనం, భారత్–అఫ్గానిస్తాన్ ఫ్రెండ్‌షిప్ డ్యాంల నిర్మాణంలో సాయం... ఇరు దేశాల మధ్య భాగస్వామ్యంలో అంకితభావానికి ఉదాహరణగా పేర్కొన్నారు. ఇరాన్, అఫ్గానిస్తాన్‌లతో చాబహర్ పోర్టు ఒప్పందం, అంతర్జాతీయ నార్త్ సౌత్ కారిడార్‌ల నిర్మాణాలు కూడా పొరుగు దేశాలతో సత్సంబంధాలుగా నిదర్శనమన్నారు. అమెరికాతో సంబంధాల గురించి మాట్లాడుతూ... కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఇటీవల జరిపిన సంభాషణను ప్రస్తావించారు. వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగించేందుకు తామిద్దరం అంగీకరించామని చెప్పారు.
రష్యా శాశ్వత మిత్ర దేశం
దేశ సముద్ర వాణిజ్యం వ్యూహాత్మకమే కాకుండా ఎంతో ప్రాముఖ్యమైందని, పసిఫిక్ మహాసముద్రంలో శాంతి, సామరస్యం, భద్రతకు ఆ ప్రాంతంలోని ఇతర దేశాలకు కూడా బాధ్యత ఉందని మోదీ అన్నారు. గల్ఫ్ దేశాలు, పశ్చిమాసియా, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, ఇరాన్ దేశాలతో సంబంధాల్ని అతి తక్కువ సమయంలో తమ ప్రభుత్వం పునర్నిర్వచించిందని పేర్కొన్నారు. భారత్‌కు రష్యా శాశ్వత మిత్ర దేశమని, ఆ దేశంతో రక్షణ రంగంతో సహా ఇతర అంశాల్లో నమ్మకం, వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత దృఢమైందన్నారు.ఈ కార్యక్రమంలో నేపాల్ మంత్రి ప్రకాశ్ శరణ్ మహత్, అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు కర్జాయ్, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని కెవిన్ రుడ్‌తో పాటు 65 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.