న్యూఢిల్లీ : ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌గా ఉన్నప్పుడు వంట చేయడమే కాక పాత్రలను కూడా శుభ్రం చేసివాడినంటూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు ప్రధాని నరేంద్ర మోదీ. ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ అనే ఫేస్‌బుక్ పేజీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను యువకుడిగా ఉన్నప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. మోదీ మాట్లాడుతూ.. ‘పదిహేడేళ్ల వయసులో హిమాలయాలకు వెళ్లి దాదాపు రెండేళ్లపాటు అక్కడే గడిపాను. ఈ పర్యట వల్ల నాలో చాలా మార్పు వచ్చింది. హిమాలయాల నుంచి వచ్చిన తర్వాత నా జీవితాన్ని ప్రజా సేవకే అంకితం చేయాలని నిర్ణయించుకున్నాను’ అని తెలిపారు.
మోదీ మాట్లాడుతూ.. ‘ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత అహ్మదాబాద్ వెళ్లాను. అంత పెద్ద నగరంలో జీవించడం అదే మొదటిసారి. అక్కడ ఉన్న మా బంధువుల క్యాంటీన్‌లో కొన్ని రోజులు పనిచేశాను. అదే సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌లో పూర్తిస్థాయి ప్రచారక్‌గా మారాను. అప్పుడే ప్రజల జీవితాల గురించి తెలుసుకోవడం ప్రారంభించాను. ఇతరులతో కలిసి ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయాన్ని శుభ్రం చేయడం.. టీ,ఆహారం తయారు చేయడం, పాత్రలు శుభ్రం చేయడం లాంటి పనులన్ని చేసేవాడిన’న్నారు. అయితే రోజువారి కార్యక్రమాలలో పడిపోయి జీవితంలో సంపాదించుకున్న ప్రశాంతతను కోల్పోకూడదని భావించేవాడిని. అందుకే కొన్ని రోజుల పాటు అడవిలోకి వెళ్లి ఒంటరిగా గడిపేవాడనని తెలిపారు మోదీ.
ఈ విషయం గురించి మోదీ మాట్లాడుతూ.. ‘యువకుడిగా ఉన్నప్పుడు ఏటా దీపావళి సమయంలో ఐదు రోజుల పాటు అడవిలోకి వెళ్లిపోయి, ఎవ్వరూ లేని చోటుకు వెళ్లి ప్రశాంతంగా గడిపేవాడిని. దీనికోసం స్వచ్ఛమైన నీరు ఉన్న చోటును ఎంచుకునేవాడిని. అంతేకాక 5 రోజులకు సరిపడా ఆహారం వెంట తీసుకెళ్లేవాడిని. ఈ ఐదు రోజులు రేడియో, దినపత్రికలు ఏమీ లేకుండా గడిపేవాడినని తెలిపారు మోదీ. ఇలా చేయడం వల్ల తనకు ఎంతో మేలు జరిగిందని.. తనను తాను మెరుగుపరుచుకోవడానికి ఎంతో ఉపయోగపడిందన్నారు మోదీ.
అయితే కొద్ది రోజుల తర్వాత తాను అడవికి వెళ్తున్నానే విషయం మిగతా వారికి తెలిసి పోయిందన్నారు. దాంతో వారు నన్ను ఎవరిని కలవడానికి వెళ్తున్నావు అని అడిగేవారు. అందుకు నేను ‘నన్ను నేను తెలుసుకునేందుకు వెళ్తున్నాను’ అని చెప్పేవాడినని తెలిపారు మోదీ. యువతకు కూడా ఇదే సలహా ఇచ్చారు మోదీ.
రోజువారీ హడావుడి జీవితాలకు విరామం ఇచ్చి.. కొంత సమయం మీతో మీరు గడిపితే అది ఎంతో ఉపయోగపడుతుందంటూ మోదీ యువతకు సలహా ఇచ్చారు. అప్పుడే నిజమైన ప్రపంచంలో జీవించడం మొదలుపెడతారన్నారు. అప్పడు మీపై మీకు నమ్మకం పెరుగుతుందని, ఇతరులు మీ గురించి ఏం చెప్తున్నారో అర్థం చేసుకోగలుగుతారని సూచించారు. మీకు మీరే ప్రత్యేకమని, ఎవరో ఏదో చేస్తారని ఎదురుచూడొద్దని మోదీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment