* ప్రణాళికా సంఘం స్థానంలో సీఎంల కౌన్సిల్.. ప్రధాని మోదీ ప్రతిపాదన
* కేంద్ర కేబినెట్ మంత్రులు, వివిధ రంగాల నిపుణులకూ చోటు.. ‘టీమ్ ఇండియా’గా నామకరణం
* కొత్త వ్యవస్థ ఏర్పాటుకు మద్దతు పలికిన ఎన్‌డీఏ పక్షాలు, ఇతర పార్టీల పాలిత రాష్ట్రాల సీఎంలు
* ప్రణాళికాసంఘం రద్దు ప్రతిపాదనను వ్యతిరేకించిన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు
* ప్రస్తుత ప్రణాళికాసంఘాన్ని పునర్‌వ్యవస్థీకరించే విషయంలో మాత్రం సీఎంల ఏకాభిప్రాయం
* రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సుదీర్ఘ చర్చలు
* దేశం భారీ ముందడుగు వేయాలంటే ప్రణాళికాసంఘం స్థానంలో కొత్త వ్యవస్థ అవసరమని వెల్లడి
* అధికారం, ప్రణాళికారచన వికేంద్రీకరణపై విస్తృత ఏకాభిప్రాయం లభించింది: ఆర్థికమంత్రి జైట్లీ
* ప్రణాళికాసంఘం స్థానే కొత్త వ్యవస్థ స్వరూపం, విధివిధానాలు జనవరి 26 నాటికి ఖరారు?
కొత్త వ్యవస్థలో రాష్ట్రాలకు కీలక పాత్ర ఉండాలి. తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు ఏ వేదికా లేదని రాష్ట్రాలు కొన్నిసార్లు భావిస్తుంటాయి. అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించడానికి ఒక సమర్థవంతమైన వ్యవస్థ ఉండాలి.
- నరేంద్ర మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: స్వాతంత్య్రానంతరం నుంచి కొనసాగుతున్న కేంద్ర ప్రణాళికాసంఘం స్థానంలో.. ప్రధానమంత్రి సారథ్యంలో పనిచేసే ముఖ్యమంత్రుల మండలి వ్యవస్థను నెలకొల్పే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ముందుకు తెచ్చింది. ‘టీం ఇండియా’ అనే పేరుతో నెలకొల్పే ఈ వ్యవస్థలో పలువురు కేంద్ర కేబినెట్ మంత్రులతో పాటు, వివిధ రంగాల నిపుణులకూ చోటు కల్పిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తన ఆలోచనను వివరించారు. ఇది సహకార సమాఖ్యను బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. అయితే.. ప్రణాళికాసంఘాన్ని పునర్‌వ్యవస్థీకరించే విషయంలో ముఖ్యమంత్రులందరి నుంచీ ఏకాభిప్రాయం లభించింది. కానీ.. సోవియట్ కాలం నాటి ప్రస్తుత ప్రణాళికాసంఘాన్ని పూర్తిగా రద్దు చేసి దాని స్థానంలో కొత్త వ్యవస్థను నెలకొల్పాలన్న ప్రతిపాదనకు ఎన్‌డీఏ పక్షాల పాలనలోని రాష్ట్రాలు, ఏఐఏడీఎంకే, టీఆర్‌ఎస్ తదితర పార్టీల పాలనలోని రాష్ట్రాలు మద్దతు పలకగా.. కాంగ్రెస్ పాలనలోని రాష్ట్రాలు వ్యతిరేకించాయి.
ప్రణాళికాసంఘాన్ని తొలగించి, దాని స్థానంలో సమకాలీన ఆర్థిక ప్రపంచానికి అనుగుణంగా కొత్త వ్యవస్థను నెలకొల్పుతామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కూలంకషంగా చర్చించేందుకు ప్రధాని ఆదివారం నాడు ఢిల్లీలోని తన నివాసంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సమావేశం సుదీర్ఘంగా కొనసాగింది. ప్రణాళికాసంఘం స్థానంలో కొత్తగా ఏర్పాటు చేయదలచుకున్న సంస్థ లక్ష్యాలు, విధివిధానాల గురించి కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలను ప్రణాళికాసంఘం కార్యదర్శి సింధుశ్రీ వివరించారు. ఆ తర్వాత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక్కొక్కరు 15 నిమిషాల నుంచి 30 నిమిషాల సేపు తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేశారు. మధ్యాహ్న భోజనానంతరం అధికారులు లేకుండా కేవలం ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులే సమావేశమై ఈ అంశంపై మరింత లోతుగా చర్చించారు. ఆయా రాష్ట్రాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న పథకాల సమాచారాన్ని పరస్పరం పంచుకున్నారు. ఎన్నికలు జరుగుతున్న జమ్మూకశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో పాటు.. పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ, మిజోరం సీఎం లాల్ తన్హావాలాలు ఈ సమావేశానికి హాజరు కాలేదు. మిగతా అన్ని రాష్ట్రాల సీఎంలతో పాటు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లు కూడా భేటీలో పాల్గొన్నారు.
రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి
సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ.. రాష్ట్రాలు అభివృద్ధి చెందనిదే దేశం అభివృద్ధి చెందదని ఉద్ఘాటించారు. విధాన ప్రణాళికారచన ప్రక్రియను పై నుంచి కింది వరకూ సమూలంగా మార్చాలని పేర్కొన్నారు. ‘‘కొత్త వ్యవస్థలో రాష్ట్రాలకు కీలక పాత్ర ఉండాలి. తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు ఏ వేదికా లేదని రాష్ట్రాలు కొన్నిసార్లు భావిస్తుంటాయి. అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించడానికి ఒక సమర్థవంతమైన వ్యవస్థ ఉండాలి. భారత బలాలకు అనుగుణంగా, రాష్ట్రాలను సాధికారం చేసే, ప్రభుత్వానికి వెలుపల జరిగే వాటితో సహా ఆర్థిక కార్యకలాపాలన్నిటికీ చోటు కల్పిస్తూ ఒక కొత్త వ్యవస్థను మనం అభివృద్ధి చేయగలమా?’’ అంటూ చర్చను ప్రారంభించారు. ప్రణాళికాసంఘంతో సుదీర్ఘ కాలం పనిచేసిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ కూడా.. సంస్కరణల అనంతర కాలంలో ప్రణాళికాసంఘానికి భవిష్యత్ దృష్టి లేదని పేర్కొన్నారని.. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మరింత సమర్థవంతంగా కొనసాగేందుకు ప్రణాళికాసంఘం పునరుజ్జీవనం కావాలని పేర్కొన్న విషయాన్ని మోదీ ప్రస్తావించారు. భారతదేశం భారీ ముందడుగు వేసేందుకు ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు అవకాశాన్ని అందిస్తున్నాయన్నారు. దేశ శక్తిసామర్థ్యాలను తగినవిధంగా వినియోగించుకునే దృష్టితో ప్రస్తుత ప్రణాళికాసంఘం స్థానంలో వేరొక వ్యవస్థను నెలకొల్పటం ద్వారా ఇది సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
విస్తృత ఏకాభిప్రాయం: జైట్లీ
ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయని కాబట్టి అధికారాన్ని, ప్రణాళికారచనను వికేంద్రీకరించాలనే అంశంపై విస్తృత ఏకాభిప్రాయం లభించిందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సమావేశానంతరం మీడియాకు తెలిపారు. కొత్త వ్యవస్థలో సాంకేతిక ప్రముఖులు, వివిధ రంగాల నిపుణులకు కూడా చోటు కల్పించాలని మోదీ కాంక్షిస్తున్న నేపథ్యంలో.. ఈ వ్యవస్థలో విజ్ఞాన సంస్థలు, మేధావుల పాత్రపై కూడా కూలంకషంగా చర్చించటం జరిగిందని చెప్పారు. ‘‘ఇది ప్రణాళికారచనలో, విధాన రూపకల్పనలో ప్రయివేటు రంగానికి చోటు కల్పించనున్నందున.. ఈ అంశంపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు.
మార్పులకు దాదాపు అందరూ అనుకూలంగా ఉన్నారు. అయితే.. ప్రస్తుత వ్యవస్థనే మెరుగుపరచాలా? లేక కొత్త వ్యవస్థను నెలకొల్పాలా? అనే ప్రశ్న తలెత్తింది’’ అని జైట్లీ వివరించారు. ప్రస్తుత వ్యవస్థనే మెరుగుపరచాలని ముగ్గురు, నలుగురు ముఖ్యమంత్రులు అభిప్రాయపడ్డారని పేర్కొన్నారు. ‘వారు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల వారా?’ అని ప్రశ్నించగా.. అవునని ఆయన బదులిచ్చారు. ఇప్పటికే పన్నెండో పంచవర్ష ప్రణాళిక (2012-17) అమలులో ఉన్నందున.. ప్రణాళికాసంఘాన్ని రద్దు చేస్తే ఆ ప్రణాళిక కొనసాగుతుందా లేదా అనే అంశంపై ప్రశ్నలు వచ్చాయని చెప్పారు. కొత్త ప్రణాళికా వ్యవస్థ రూపకల్పనపై ఎలాంటి కాలవ్యవధినీ నిర్ణయించలేదని.. సంప్రదింపులు పూర్తయిన తర్వాత అన్ని అభిప్రాయాలనూ కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. అయితే.. వచ్చే ఏడాది జనవరి 26వ తేదీ నాటికి కొత్త వ్యవస్థ రూపురేఖలను ఖరారు చేయవచ్చని ప్రభుత్వ వర్గాల సమాచారం.
నాలుగు అంశాలపై సుదీర్ఘ చర్చ...
భేటీలో పంచవర్ష ప్రణాళికావ్యవస్థ భవిష్యత్తు, వార్షిక ప్రణాళికలు, ప్రస్తుతం అనుసరిస్తున్న విధానంలో కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధుల ప్రవాహం అనే నాలుగు కోణాలపై చర్చలు జరిపారు. ప్రస్తు త ప్రణాళికాసంఘాన్ని పూర్తిగా రద్దుచేసి.. సహకార సమాఖ్యను బలోపేతం చేసేలా ప్రధాని, కొందరు కేంద్ర మంత్రులు, సీఎంలతో పాటు పలువురు సాంకేతిక ప్రముఖులు, వివిధ రంగాల నిపుణులతో ‘టీమ్ ఇండియా’ వ్యవస్థను నెలకొల్పే ఆలోచనను మోదీ ప్రతిపాదించారు.
సీఎంలకు రొటేషన్ ప్రాతిపదికన ఈ వ్యవస్థలో చోటు కల్పించటంతో పాటు.. రాష్ట్రాల తమ అవసరాలకు అనుగుణంగా నిధులు వినియోగించుకునే స్వేచ్ఛ ఇచ్చే ప్రతిపాదనలు చేశారు. అయితే.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు.. ప్రణాళికాసంఘాన్ని పునర్‌వ్యవస్థీకరించాలన్న ఆలోచనకు మద్దతుపలికారు. కానీ.. ప్రణాళికాసంఘాన్ని పూర్తిగా రద్దుచేయాలన్న ఆలోచనను వ్యతిరేకించారు. ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాల పాలనలో ఉన్న కొన్ని రాష్ట్రాలు, ఏఐఏడీఎంకే, టీఆర్‌ఎస్ వంటి పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలు మాత్రం.. ప్రణాళికాసంఘాన్ని తక్షణమే రద్దుచేయటానికి మొగ్గుచూపారు.