ప్రత్యర్థులపై దుర్భాషలు సరికాదు : మన్మోహన్ సింగ్
రాయ్‌పూర్: రాజకీయ ప్రత్యర్థులపై విమర్శల్లో ప్రతిపక్ష పార్టీ ఏవిధంగానూ హుందాగా వ్యవహరించట్లేదని, అసభ్య పదజాలం ఉపయోగించడం సరికాదని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ బీజేపీపై ధ్వజమెత్తారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఇటీవల తీవ్ర పదజాలంతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లో ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపైనా మన్మోహన్‌సింగ్ విమర్శనాస్త్రాలు సంధించారు. నక్సలిజాన్ని అణచివేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ నాయకులకు తగిన భద్రత కల్పించడంతో పాటు విద్య, వైద్య, ఆరోగ్య రంగాల్లో రమణ్‌సింగ్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈ ఏడాది మే 25న బస్తర్ ప్రాంతంలో కాంగ్రెస్ ముఖ్య నేతలపై నక్సల్ దాడిని ప్రస్తావిస్తూ, ‘‘ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి. కానీ ఇలాంటి ఘటనలు పునరావృతంగాకుండా మనమెందుకు నిలువరించలేకపోతున్నాం.
బీజేపీ పాలనలో శాంతిభద్రతలు ఎలా దిగజారాయో ఈ దాడి అద్దం పడుతోంది’’ అని విమర్శించారు. ఈనెల 11న ఛత్తీస్‌గఢ్ శాసనసభ తొలిదఫా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శనివారం రాయ్‌పూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి మన్మోహన్‌సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కేంద్రంలో 1998-2004 మధ్య కాలంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ పాలనతో తర్వాత అధికారంలోకి వచ్చిన యూపీఏ ప్రభుత్వ పాలనను పోల్చి చూస్తే అనేక రంగాల్లో అభివృద్ధి జరిగిందన్నారు. ప్రభుత్వ విధానాలతో విభేదించినపుడు ప్రతిపక్షాలు తప్పకుండా విమర్శించాలని, అయితే ఇతర పార్టీల నాయకులు, ముఖ్యమంత్రులపై ముఖ్యంగా బీజేపీలో కొంతమంది నేతలు అసభ్య పదజాలం ఉపయోగిస్తున్నారని తప్పుపట్టారు. కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం పార్టీ హుందాతనానికి భంగం కలిగించేలా అసభ్య పదజాలం ఉపయోగించొద్దన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఛత్తీస్‌కు హామీల వర్షం కురిపించారు. రూ. 33 వేల కోట్ల పెట్టుబడులతో 24 భారీ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.