ఐరాసలో ‘హిందీ’ ప్రసంగం
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితిలో భారత ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగం ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించనున్నారు! ఈ నెల చివర్లో ఐరాస సాధారణ సభ సమావేశంలో మోడీ పాల్గొననుండడం తెలిసిందే. ఆ సందర్భంగా మోడీ హిందీలో ప్రసంగించనున్నట్లు హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. హిందీ దివస్ సందర్భంగా ఆదివారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాజ్‌నాథ్ పాల్గొన్నారు. అమెరికాలో హిందీలో మాట్లాడిన మొదటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి అని చెప్పారు. విదేశీ అతిథులను కలుసుకున్నప్పుడు ప్రధాని మోడీ వారితో హిందీలోనే మాట్లాడుతుంటారని రాజ్‌నాథ్ వెల్లడించారు. దేశంలో 55 శాతం హిందీ మాట్లాడగలరని, 90 శాతం మంది అర్థం చేసుకోగలరన్నారు.
మోడీకి ఎర్రతివాచీ
మోడీకి ఎర్రతివాచీతో ఘనంగా స్వాగతం పలికేందుకు అమెరికా యంత్రాంగం సిద్ధమవుతోంది. ద్వైపాక్షిక సంబంధాలను ఉన్నత స్థితికి తీసుకెళ్లడానికి, ఇరు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య, రక్షణ ఒప్పందాలు పట్టాలెక్కించడానికి ఈ పర్యటనను అనువుగా మలచుకోవాలని అగ్రరాజ్యం భావిస్తోంది. ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొన్న అనంతరం మోడీ ఈ నెల 29న న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ రానున్నారు. అదే రోజు మోడీకి అమెరికా అధ్యక్షుడు ఒబామా చిన్నపాటి విందు ఇవ్వనున్నారు. ఆ రోజు, మరుసటి రోజు ఒబామా, మోడీ మధ్య చర్చలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఇరాక్, సిరియా, ఇరాన్, ఇజ్రాయెల్-పాలస్తీనా తదితర అంశాలపై అభిప్రాయాలను మోడీతో ఒబామా పంచుకోనున్నారు.