నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూతో గోపాల్ సింగ్ చావ్లా (కుడివైపు)
అమృత్‌సర్: కాంగ్రెస్ నేత, పంజాబ్ మంత్రి నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఖలిస్తాన్ వేర్పాటువాద నాయకుడు గోపాల్ సింగ్ చావ్లాతో ఆయన ఫోటో దిగడం తాజాగా వివాదాస్పదమైంది. గురువారం గోపాల్ సింగ్ తన ఫేస్‌బుక్‌లో సిద్దూతో దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. ఇటీవల అమృత్‌సర్‌లోని నిరంకారి భవన్ వద్ద జరిగిన ఉగ్రవాద దాడికి, చావ్లాతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. చావ్లాతో తాను ఫొటో దిగడంపై తీవ్ర విమర్శలు వస్తుండటంతో మంత్రి సిద్ధూ స్పందించారు. గోపాల్ సింగ్ చావ్లా ఎవరో తనకు తెలియదని, పాక్‌లో తనతో వేలమంది ఫొటో దిగారని, అతను ఎవరో తాను గుర్తుపట్ట లేదని ఆయన వివరణ ఇచ్చారు.
మరోవైపు చావ్లాతో సిద్ధూ ఫొటో దిగడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఇందిరా గాంధీలాగే పంజాబ్‌ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారా?’ అని రాహుల్‌ను ఉద్దేశించి బీజేపీ ప్రశ్నించింది. ‘నాలుగు రోజుల క్రితమే అమృత్‌సర్‌లో జరిగిన ఉగవాద దాడి వెనుక ఖలిస్తాన్‌వాదుల హస్తం ఉందని పోలీసులు కనుక్కున్నారు. నిన్న నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూ, చావ్లాతో కలిశారు. దీని వెనుక ఏంజరుగుతుందో రాహుల్‌గాంధీని చెప్పాలం’టూ బీజేపీ నేత తాజిందర్ బగ్గా ట్వీట్ చేశారు.
సిద్దూకు దేశమంటే పట్టింపు ఉందా? లేక వేరే ఉద్దేశంతో ఉన్నారా? అని అకాలీదళ్ ఘాటుగా ప్రశ్నించింది. సిద్దూ ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతంలోనే ఉగ్రవాద దాడి జరిగిందని, దీని వెనుక చావ్లా హస్తముందని అకాలీదళ్ పేర్కొంది. చావ్లాను సిద్దూ చాలాసార్లు దూరంపెట్టారని, కానీ ఈ సారి అతడు ఎలాగోలా సిద్దూతో ఫోటో దిగగలిగారని ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యుడు పరమజిత్ సింగ్ సర్నా చెప్పారు. సిద్దూ పాకిస్తాన్‌తో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారని, భారతీయుల కంటే పాకిస్తానీల నుంచే ఆయన ఎక్కువ ప్రేమాభిమానాలు పొందుతున్నారని కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ వ్యంగ్యంగా పేర్కొన్నారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సిద్ధూ అక్కడినుంచే పోటీ చేయించాలనుకుంటున్నారని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment