2019లోనూ గెలుద్దాం!
► ఎన్డీయే భాగస్వామ్య పార్టీల ప్రతిన
► మోదీ నేతృత్వంలో 33 పార్టీల సమావేశం
న్యూఢిల్లీ: 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లోనూ విజయం సాధించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కలసికట్టుగా పనిచేయాలని ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు సంకల్పం తీసుకున్నాయి. దేశ పురోగతికి ఆయన బలమైన నాయకత్వం అవసరమని పేర్కొన్నాయి. సోమవారమిక్కడ మోదీ అధ్యక్షతన సమావేశమైన కూటమిలోని 33 పార్టీలు ఆయన నాయకత్వానికి, ప్రభుత్వ విధానాలకు మద్దతు పలుకుతూ ఈమేరకు తీర్మానాన్ని ఆమోదించాయి. త్వరలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల బల ప్రదర్శనగా జరిగిన ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
కూటమిని విస్తరించి బలోపేతం చేయాలని నిర్ణయించాయి. సమావేశంలో పాల్గొన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అనంతరం విలేకర్లకు ఈ వివరాలు తెలిపారు. రాష్ట్రపతి ఎన్నిక అంశం భేటీలో చర్చకు వచ్చిందా అని ప్రశ్నించగా అది అజెండాలో లేదని బదులిచ్చారు. 2019లో జరిగే ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి రావడానికి మోదీ నాయకత్వంలో పనిచేయాలని పార్టీలు నిర్ణయించినట్లు జైట్లీ వెల్లడించారు.
అవినీతి రహిత పాలన మోదీ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయమని, అధికార కూటమికి గత మూడేళ్లలో మద్దతు, ప్రజాదరణ పెరిగాయని వ్యాఖ్యానించారు. బీజేపీ చీఫ్ అమిత్ షా ప్రసంగంతో మొదలైన ఈ సమావేశానికి ప్రకాశ్‌సింగ్ బాదల్(శిరోమణి అకాలీ దళ్), రాంవిలాస్ పాశ్వాన్(ఎల్జేపీ), చంద్రబాబు నాయుడు(టీడీపీ) తదితరులతోపాటు మోదీని తరచూ విమర్శిస్తున్న ఉద్ధవ్ ఠాక్రే(శివసేన) కూడా హాజరయ్యారు. ఇటీవల గోవా, ఈశాన్య రాష్ట్రాల నుంచి కూటమిలో చేరిన పార్టీల నేతలూ పాల్గొన్నారు. ఎన్డీఏ 2014లో అధికారంలోకి వచ్చాక సమావేశం కావడం ఇది రెండోసారి.