
పీవీకి ఎన్డీఏ సర్కారు స్మారకం
న్యూఢిల్లీ: ఆర్థిక సంస్కరణల వైతాళికుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు దేశ రాజధాని ఢిల్లీలో ఎట్టకేలకు స్మారక చిహ్నం దక్కనుంది. ఆయనకు సొంత పార్టీ అయిన కాంగ్రెస్ హస్తినలో స్మారకాన్ని నిరాకరించగా, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఆ గౌరవాన్ని కట్టబెట్టేందుకు సిద్ధమైంది. పదేళ్ల కిందట చనిపోయిన పీవీకి ఢిల్లీలోని యమునా నది ఒడ్డున ఏక్తా స్థల్‌లో స్మారకాన్ని నిర్మించాలని ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేసిందని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈమేరకు ఓ కేబినెట్ నోట్‌ను సిద్ధం చేసింది. పీవీకి సముచిత స్మృతి చిహ్నాన్ని నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన అందాక దీన్ని రూపొందించింది.
తెలంగాణకు చెందిన పీవీకి స్మారకాన్ని కట్టాలని టీ డీపీ గత ఏడాది అక్టోబర్‌లో తీర్మానం చేసింది. పట్టణాభివృద్ధి శాఖ ప్రతిపాదన ప్రకారం.. పీవీ స్మారకాన్ని పాలరాతితో కడతారు. పైన శిలాఫలకం ఉంటుంది. 1991-96 మధ్య ప్రధానిగా పనిచేసిన పీవీని కాంగ్రెస్ విస్మరించడం, 2004లో ఆయన చనిపోయాక స్మారక నిర్మాణానికీ తిరస్కరించడం తెలిసిందే. ఢిల్లీలో స్థలం కొరత వల్ల ఇకపై ఏ నేతకూ ప్రత్యేక స్మృతిచిహ్నాన్ని ఏర్పాటు చేయకూడదని కూడా 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం నిర్ణయించింది. స్మృతి నిర్మాణాలకు బదులుగా ఉమ్మడి స్మారక స్థలాన్ని ఏర్పాటు చేశా రు. 22.56 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఏక్తా స్థల్ లో మాజీ ప్రధానులు ఐకే గుజ్రాల్, చంద్రశేఖర్, మాజీ రాష్ట్రపతులు జ్ఞానీ జైల్‌సింగ్, శంకర్ దయాళ్ శర్మ, కేఆర్ నారాయణన్, ఆర్. వెంకటరామన్‌ల స్మారకాలు ఉన్నాయి. తొమ్మిది స్మారకాల కోసం దీన్ని ఏర్పా టు చేయగా, మరో మూడింటికి స్థలముంది.