
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : నీట్(నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్)- 2018 ఫలితాలను సోమవారం మధ్యాహ్నం వెల్లడించారు. దేశవ్యాప్తంగా మే 6న 2,225 కేంద్రాల్లో నిర్వహించిన నేషనల్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌కు 13 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. నీట్- 2018లో ఏడు లక్షల మంది ఉత్తీర్ణులు కాగా వీరిలో 6.3 లక్షల మంది జనరల్ కేటగిరీకి చెందినవారే.
ఫలితాల కోసం cbseneet.nic.in, cbseresults.nic.inను క్లిక్ చేయవచ్చు. నీట్ ఫలితాలను వాయిదా వేయాలంటూ, స్టే ఇవ్వాల్సిందిగా కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఒకరోజు ముందుగానే సీబీఎస్‌ఈ నీట్ ఫలితాలను వెల్లడించింది. ఈ రోజు వెల్లడైన నీట్ ఫలితాల్లో కల్పనా కుమారి నీట్ ఆలిండియా టాపర్‌గా నిలిచారు. 720 మార్కులకు గానూ 690 మార్కులు పొందారు.
కాగా ఈ ఏడాది నుంచి తెలుగు రాష్ట్రాలు నేషనల్ పూల్‌లోకి రానున్నాయి. ఏపీలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,750 సీట్లు ఉండగా 261 నేషనల్ పూల్‌లోకి వెళ్లనున్నాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 2250 సీట్లు ఉండగా కన్వీనర్ కోటా కింద 1177, బీ కేటగిరీ 730, ఎన్‌ఆర్‌ఐ కోటా కింద 342 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
తెలంగాణలో మొత్తం 3450 మెడికల్ సీట్లు ఉండగా... ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1250, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 2100 సీట్లు ఉన్నాయి. వీటిలో కన్వీనర్ కోటా కింద 1050, బీ కేటగిరీలో 731, ఎన్‌ఆర్‌ఐ కోటా కింద 319 సీట్లు భర్తీ చేయనున్నారు. తెలంగాణలోని 169 సీట్లు నేషనల్ పూల్‌లోకి వెళ్లనున్నాయి.