గందరగోళం తగ్గింది.. ‘నీట్‌’గా ముగిసింది!  | NEET Exam Completed | Sakshi
Sakshi News home page

గందరగోళం తగ్గింది.. ‘నీట్‌’గా ముగిసింది!

Published Mon, May 6 2019 1:32 AM | Last Updated on Mon, May 6 2019 1:37 AM

NEET Exam Completed - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎంబీబీఎస్, బీడీఎస్‌లలో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే ‘నీట్‌’పరీక్ష ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా జరిగింది. కఠినమైన నిబంధనల కారణంగా అక్కడక్కడ విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి నీట్‌లో అడిగిన ప్రశ్నలు సులువుగా ఉన్నాయని, గందరగోళం పెద్దగా లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈసారి అర్హత మార్కులు కూడా పెరిగే అవకాశముందంటున్నారు. గతేడాది కెమిస్ట్రీ పేపర్‌ లో 5 ప్రశ్నలు గందరగోళంగా ఉండగా ఈసారి అటువంటి పరిస్థితి లేదని నిపుణులు అంటున్నారు. బయాలజీ సబ్జెక్టుకు సంబంధించి గతంలో ఎన్సీఈఆర్‌టీలో లేనివి కనీసం నాలుగైదు ప్రశ్నలు వచ్చేవి. ఈసారి మాత్రం ఎన్సీఈఆర్‌టీ నుంచే వచ్చాయి. అయితే బాటనీలో మాత్రం క్రోమోజోమ్స్‌ కాన్సెప్ట్‌ మీద ఇచ్చిన ప్రశ్న సిలబస్‌లో లేదు. 98% మంది విద్యార్థులు దీనికి జవాబు రాసే అవకాశమే లేదని తెలుస్తోంది.

మరో రెండు ప్రశ్నలు కాస్త కన్‌ఫ్యూజన్‌గా ఉన్నాయి. వాటికి ఏది సరైన సమాధానమో విద్యార్థులకు అంతుబట్టలేదు. నీట్‌లో ఫిజిక్స్‌ కఠినంగా ఉంటుందన్న భావన ఉంటుంది. కానీ ఈసారి ఫిజిక్స్‌లోని 45 ప్రశ్నల్లో 25 ప్రశ్నలు అత్యంత ఈజీగా ఉండేవి బేసిక్‌ మోడల్‌వి ఇచ్చారు. లెవల్‌ 3, 4స్థాయి ప్రశ్నలు కాకుండా లెవల్‌ 1 స్థాయి ప్రశ్నలు వచ్చాయి. దీనివల్ల చాలామంది ఫిజిక్స్‌లో మరిన్ని మార్కులు సాధించే అవకాశముంది. మిగిలినవాటిలో 15 ప్రశ్నలు మధ్యస్థంగా ఉండగా, మరో ఐదు ఫిజిక్స్‌ ప్రశ్నలు కఠినంగా ఉన్నాయి. అందులో ఒక ప్రశ్నకు సరైన సమాధానం విషయంలో కాస్త గందరగోళం ఉంది. మొత్తంగా ఈ ఏడాది నీట్‌ పేపర్‌లో 3 ప్రశ్నలు గందరగోళంగా ఉన్నాయని తేలినట్లు నిపుణులంటున్నారు. ఓవరాల్‌గా నీట్‌ పరీక్ష ఈజీగా ఉందని వివిధ కార్పొరేట్‌ కాలేజీల లెక్చరర్లు విశ్లేషిస్తున్నారు. పైగా గతంలో తప్పులు దొర్లేవని.. ఈసారి అలాంటివి కనిపించలేదని తెలిపారు. 

అర్హత మార్కులు పెరిగే చాన్స్‌ 
ఈసారి నీట్‌ పరీక్ష సులువుగా ఉండటంతో అర్హత మార్కులు కూడా పెరిగే అవకాశం ఉందని అధ్యాపకులు అంటున్నారు. గతేడాదితో పోలిస్తే 20–25 వరకు అర్హత మార్కులు పెరిగే అవకాశం ఉందంటున్నారు. 720 నీట్‌ మార్కులకు గాను, గతేడాది జనరల్‌ కేటగిరీలో అర్హత మార్కులు 105 ఉంది. ఈసారి 125 నుంచి 130 మార్కుల వరకు పెరిగే అవకాశముందని అంటున్నారు. అలాగే ఆలిండియా టాప్‌ వెయ్యి ర్యాంకులు సాధించిన విద్యార్థుల మార్కులు 650పైనే ఉండేది. అది కూడా ఈసారి పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి శ్రీచైతన్య జూనియర్‌ కాలేజీ డీన్‌ శంకర్‌రావు తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 75 వేల మంది వరకు పరీక్ష రాసి ఉంటారని ఆయన వివరించారు. 

ఫుల్‌ షర్ట్‌ను కట్‌ చేసి.. 
ఆభరణాలు ధరించుకోకూడదని.. పొడుగు చొక్కాలు వేసుకోవద్దని.. ఇలా అనేక కఠిన నిబంధనలను నీట్‌ నిర్వాహకులు ముందే చెప్పారు. అయినా కొన్నిచోట్ల అలా వచ్చిన వారిపై ఏమాత్రం కనికరం లేకుండా నిర్వాహకులు వ్యవహరించారు. వరంగల్‌ జిల్లాలో నీట్‌ పరీక్షలు ప్రశాంతంగా జరిగినా ఒకట్రెండు చోట్ల ఇబ్బందులు తలెత్తాయి. ఆ జిల్లాలో మొత్తం 5,695 మంది కోసం 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 5,498 మంది (97%) హాజరయ్యారు. నీట్‌లో కఠినమైన నిబంధనలతో కొన్నిచోట్ల అపశ్రుతి దొర్లింది. ఫుల్‌ హ్యాండ్స్‌ షర్ట్స్‌ వేసుకొచ్చిన విద్యార్థులను షర్ట్‌లను హాఫ్‌ హ్యాండ్స్‌గా కట్‌ చేశాకే పరీక్ష హాల్లోకి అనుమతించారు. అలాగే ముక్కు పుడకలు తొలగించాకే అమ్మాయిలను అనుమతించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించినప్పటికీ..విద్యార్థులు నిర్దేశిత సమయానికి గంటన్నర ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. హాల్‌టికెట్‌తో పాటు ఆధార్‌కార్డు ఉన్న వారిని అనుమతించారు. హైహీల్స్, వాచీలు, చెవి, ముక్కు పోగులు సహా ఇతర బంగారు ఆభరణాలను తీసివేయించారు. 

రెండు గంటల ముందే.. 
హైదరాబాద్‌లో నీట్‌పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నిమిషం నిబంధన నేపథ్యంలో విద్యార్థులు పరీక్ష సమయం కంటే రెండు గంటల ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఆదివారం కావడంతో నగరంలోనూ రోడ్లు ఖాళీగానే ఉన్నాయి. దీనికితోడు ట్రాఫిక్‌ జామ్‌ అయ్యే ప్రాంతాల్లో పోలీసుల ముందస్తు చర్యల కారణంగా విద్యార్థులు సరైన సమయంలోపే పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు వీలుపడింది. అయితే పరీక్షా కేంద్రాల వద్ద సరైన వసతుల్లేకపోవడంతో వీరితోపాటు వచ్చిన తల్లిదండ్రులు, బంధువులు ఇబ్బందులుపడాల్సి వచ్చింది. నగరంలో నీట్‌ పరీక్షకు 95శాతానికి పైగా హాజరైనట్లు తెలుస్తోంది. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరక్కపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఖమ్మం జిల్లాలో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం 3,322మంది అభ్యర్థులకు గాను 3171మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్లు నీట్‌ సిటీ కోఆర్డినేటర్‌ పార్వతీరెడ్డి తెలిపారు. ఇదిలావుంటే పరీక్షా కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కల్పించకపోవటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారు. పరీక్షా కేంద్రాలకు తమ పిల్లలను తీసుకొచ్చిన తల్లిదండ్రులు పరీక్ష ముగిసే వరకు సమీపంలోని చెట్ల కింద సేద తీరారు. అయితే.. నీట్‌ పరీక్ష వ్యవహారాలను రాష్ట్రానికి సంబంధించి ఎవరు పర్యవేక్షిస్తున్నారన్న సమాచారం లేదు. కేంద్రమే దీన్ని నిర్వహిస్తున్నందున రాష్ట్రస్థాయిలో సమాచారం ఇచ్చే నాథుడే లేకపోవడంపై విమర్శలు వచ్చాయి. 

అర్హత సాధిస్తా
ప్రణాళిక ప్రకారం చదువుకొని పరీక్ష బాగా రాశాను. నీట్‌ పరీక్షలో అర్హత సాధిస్తాననే నమ్మకం కలిగింది. పరీక్షా కేంద్రం వద్ద సరైన సౌకర్యాలు కల్పించకపోవటంతో ఇబ్బందులు పడ్డాం.– దలువాయి సాయి సాకేత్, ఖమ్మం 
 

మంచి ర్యాంక్‌ వస్తుంది 
నీట్‌ పరీక్షను బాగానే రాశాను. మంచి ర్యాంక్‌ వస్తుందని ఆశిస్తున్నా. సరైన సౌకర్యాలు కల్పించకపోవటంతో ఇబ్బందులు పడ్డాం. – నన్నక భార్గవ్, ఖమ్మం 



 

పేపర్‌ ఈజీగానే..  
నీట్‌ పరీక్ష పేపర్‌ గత రెండేళ్ల కంటే చాలా సులువుగా ఉంది. పెద్దగా గందరగోళం కూడా లేదు. మొత్తంగా 3 ప్రశ్నలకు ఏది సరైన సమాధానమో అంతుబట్టడంలేదు. రాష్ట్రవ్యాప్తంగా నీట్‌ ప్రశాంతంగా జరిగినట్లు సమాచారం ఉంది.  – డి.శంకర్‌రావు, డీన్, శ్రీచైతన్య జూనియర్‌ కాలేజీ, కూకట్‌పల్లి, హైదరాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement