సాక్షి, న్యూఢిల్లీ : భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం, రాజకీయాల సంగతెలా ఉన్నా ముందుగా పాక్ చెరలో ఉన్న భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ క్షేమంగా తిరిగి స్వదేశానికి రప్పించేలా చొరవ చూపాలని మోదీ సర్కార్‌పై నేతలు, నెటిజన్లు ఒత్తిడి పెంచుతున్నారు. సోషల్ మీడియాలో బీజేపీ పోస్టులపై అభినందన్‌ను తిరిగి రప్పించాలని కోరుతూ కామెంట్ల రూపంలో నెటిజన్లు భారీగా ముందుకొస్తున్నారు. బూత్ స్ధాయిలో పార్టీ పటిష్టతపై బీజేపీ చేసిన ఓ పోస్ట్‌పై ట్విటర్‌లో ఒకరు షేమ్ అంటూ కామెంట్ చేశారు. ఈ సమయంలో ఇలాంటి పోస్టులు అవసరమా అంటూ ఆ యూజర్ బీజేపీపై మండిపడ్డారు.
ముందుగా అభినందన్‌జీని దేశానికి రప్పించండి అంటూ పాక్ చెరలో ఉన్న భారత పైలట్ దుస్ధితిని హైలైట్ చేస్తూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. ముందుగా అభినందన్‌ను దేశానికి తీసుకురాకుండా ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడటం సరైన పద్ధతి కాదని ఆయన ఘాటుగా బదులిచ్చారు. మరోవైపు వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ సురక్షితంగా తిరిగివచ్చేవరకూ ప్రధాని నరేంద్ర మోదీ తన రాజకీయ కార్యకలాపాలను రద్దు చేసుకోవాలని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్ధుల్లా సూచించారు.
కాగా, పాక్‌పై భారత వైమానిక దాడులతో బీజేపీకి దేశవ్యాప్తంగా ఎన్నికల్లో భారీగా లబ్ధి చేకూరుతుందని కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలపైనా నెటిజన్లు మండిపడుతున్నారు.మరోవైపు పాకిస్తాన్ ఉగ్ర కార్యకలాపాలను అణిచివేయాలని, ఉగ్రవాద శిబిరాలకు తోడ్పాటును మానుకోవాలని అమెరికా సహా ప్రపంచ దేశాల నుంచి పాక్‌పై ఒత్తిడి పెరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment