సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఉద్యోగాలే లేనప్పుడు ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణాల వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల లాభం ఏమిటని సోషల్ మీడియాలో హాస్యోక్తులు వైరల్ అవుతున్నాయి. ఉద్యోగాలను బీజేపీకీ చెందిన బాలీవుడ్ నటుడు అనుపమ్ కేర్ గుండుతో పోలుస్తూ రిజర్వేషన్లను జుట్టు దువ్వుకునే దువ్వెనతో పోలుస్తున్నారు. ఇంకా బాగా చెప్పాలంటే గణితం ప్రకారం సున్నాను ఏ అంకెతో గుణించినా ఫలితం సున్నానే అవుతుంది. పది శాతం రిజర్వేషన్లను సున్నా ఉద్యాగాలతో గుణిస్తే సున్నానే వస్తుంది. కనుక పది శాతం రిజర్వేషన్లు సున్నాతో సమానం.
దేశంలో ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగాలిస్తానంటూ ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. ఆయన మాట హామీగానే ఉండిపోవడమే కాదు. 2018లో దేశంలో ఉన్న ఉద్యోగాలు కోటి పది లక్షలు ఊడిపోయాయని ఆజిమ్ ప్రేమ్‌జీ యూనివర్శిటీకి చెందిన ఆర్థిక పరిశోధన మండలి ఓ అధ్యయనంలో తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో 84 శాతం ఉద్యోగాలు పోగా, పట్టణ ప్రాంతాల్లో 16 శాతం ఉద్యోగాలు పోయాయి. వారిలో 88 లక్షల మంది మహిళల ఉద్యోగాలు పోగా, మిగతావి పురుషుల ఉద్యోగాలు పోయాయట. ఫలితంగా 2018వ సంవత్సరం డిసెంబర్‌లో 27 నెలల్లో అత్యధిక నిరుద్యోగుల శాతం 7.75 శాతంగా నమోదయింది.
పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వైఫల్యాల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. జాతీయ స్థూల ఉత్పత్తి సవరించిన స్కేల్ ప్రకారం గతేడాది 7.4 శాతం ఉండగా, ఈ ఏడాది అది 7.2 శాతానికి చేరుకుంది. జీఎస్టీ వసూళ్లు బడ్జెట్ అంచనాలకు 40 శాతం దిగువున ఉన్నాయి. ఈ ఒక్క సంవత్సరమే ఇప్పటికే ద్రవ్య లోటు 15 శాతానికి చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 32 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 47 రూపాయలు సగటున సంపాదిస్తే దారిద్య్ర రేఖకు ఎగువున ఉన్నట్లు భావిస్తున్న నేపథ్యంలో సంవత్సరానికి ఎనిమిది లక్షలు, అంటే రోజుకు 2,192 రూపాయలకుపైగా సంపాదించే వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల ఫలితం ఏమిటని సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తోంది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రతి జన్‌ధన్ ఖాతాలోకి 15 లక్షల రూపాయలు వచ్చినట్లే రేపు పది శాతం రిజర్వేషన్లు కూడా అమలవుతాయని ఛలోక్తులు విసురుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment