'350 మంది ఖాతాల మదుపు పూర్తి చేశాం'
న్యూఢిల్లీ : నల్లధనం కేసుల వ్యవహారంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ 350 మంది ఖాతాల మదుపు పూర్తి చేశామని, మిగతా ఖాతాల మదింపు మార్చిలోగా పూర్తి చేస్తామని ఆయన సోమవారమిక్కడ తెలిపారు. అలాగే స్విస్ అధికారులతో మాట్లాడేందుకు ఓ బృందాన్ని అక్టోబర్లోనే పంపినట్లు జైట్లీ తెలిపారు.
విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం ఆరు, ఏడు నెలలుగా చర్యలు తీసుకుంటోందన్నారు. కాగా విదేశీ బ్యాంకుల్లో బ్లాక్ మనీ పోగేసుకున్న 60 మందిపై దర్యాప్తు ప్రారంభించనుంది. వీరి ఖాతాల్లో రూ.1,500 కోట్లకు పైగా సొమ్ము ఉన్నట్లు అధికారులు గుర్తించారని సమాచారం. గత అక్టోబర్‌లో 627 మంది నల్ల కుబేరుల పేర్లతో కేంద్రం సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది.