60 మంది నల్ల కుబేరులపై దర్యాప్తు!
న్యూఢిల్లీ: నల్లధనంపై కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. విదేశీ బ్యాంకుల్లో బ్లాక్ మనీ పోగేసుకున్న 60 మందిపై దర్యాప్తు ప్రారంభించనుంది. వీరి ఖాతాల్లో రూ.1,500 కోట్లకు పైగా సొమ్ము ఉన్నట్లు అధికారులు గుర్తించారని సమాచారం. గత అక్టోబర్‌లో 627 మంది నల్ల కుబేరుల పేర్లతో కేంద్రం సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది.
స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని దేశానికి రప్పిస్తామని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన నరేంద్ర మోదీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదని ఇటీవల విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, నల్లధనం విషయంలో సమాచారాన్ని పంచుకోవటంలో విభేదాలు ఉన్నప్పటికీ... భారత్‌తో సహకరించటానికి సిద్ధంగా ఉన్నామని స్విట్జర్లాండ్ తెలిపింది.
బ్యాంకు ఖాతాల వివరాలను భారత్‌తో పంచుకునేందుకు స్విట్జర్లాండ్ తిరస్కరించడంతో ద్వైపాక్షిక సంబంధాల్లో ఉద్రిక్తత కొనసాగుతుండడం తెలిసిందే. అంతర్జాతీయ ఆర్థిక, పన్ను అంశాలుపై తాజాగా వెలువరించిన తన వార్షిక నివేదికలో స్విస్ భారత్‌కు అత్యధిక ప్రాధాన్యమిచ్చింది.