
సాక్షి, న్యూఢిల్లీ : పోలవరం, ములలంకలో జరుగుతున్న వ్యర్థాల డంపింగ్‌పై జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో గురువారం విచారణ జరిగింది. కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర ,రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లు ఆయా ప్రాంతాల్లో తనిఖీలు జరపాలని ఎన్జీటీ ఆదేశించింది. తనిఖీ నివేదికలో చేసే సూచనలను అమలు చేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఎన్జీటి ఆదేశించింది. కేంద్ర పర్యావరణ శాఖ.. డంపింగ్ వివాదంపై ఎలాంటి ఆదేశాలు అవసరం లేదని విచారణపై అభ్యంతరం వ్యక్తం చేసింది. గతంలోనే ఎన్జీటి తనిఖీలు జరిపించి తగిన ఆదేశాలు ఇచ్చిందని కేంద్ర పర్యావరణ శాఖ తరపు న్యాయవాది చెప్పారు.
కేంద్ర పర్యావరణ శాఖ అభ్యంతరాన్ని తోసిపుచ్చిన ఎన్జీటి ఆ ఆదేశాలు అమలు చేసి ఉంటే మళ్లీ పిటిషన్ వేసేవారు కాదని అభిప్రాయపడింది. పోలవరం గ్రామానికి సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యర్థాలను డంపింగ్ చేస్తున్నారని పెంటపాటి పుల్లారావు పిటిషన్ వేశారు. గతంలో రెండు సార్లు తనిఖీలు జరిపి నివేదిక ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. నివేదిక అమలును పరిశీలిస్తామని, ఆ తర్వాత తదుపరి విచారణ ఉంటుందని ఎన్జీటి తెలిపింది.