రెండు వారాలు వాయిదావేస్తూ ఉత్తర్వులు జారీచేసిన ఎన్‌జీటీ
మే1 లోగా తగిన సూచనలు ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం
నిషేధం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయన్న ప్రభుత్వం
ట్రక్కులు నడపబోమని హెచ్చరించిన యజమానులు
పాత డీజిల్ కారు వాహనదారులకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: పదేళ్ల దాటిన అన్ని డీజిల్ వాహనాలను స్వాధీనం చేసుకోవలసిందిగా జారీ చేసిన ఆదేశాల అమలును నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) రెండు వారాల పాటు వాయిదా వేసింది. డీజిల్ వాహనాల నిషేధం అమలు చేస్తే ఎదురయ్యే సమస్యలను తెలుపుతూ ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన విజ్ఞప్తిని సోమవారం పరిశీలించిన ట్రిబ్యునల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మే1న తదుపరి విచారణ జరిపే లోగా నిషేధాన్ని మెరుగ్గా అమలు చేసేందుకు సూచనలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండు వారాల వరకు డీజిల్ వాహనాలను స్వాధీనం చేసుకోరని ఎన్‌జీటీ చైరపర్సన్, న్యాయమూర్తి స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
రెండు వారాల పాటు మాత్రమే తమ ఉత్తర్వుపై స్టే విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. కాలుష్యాన్ని కలిగించే పాత డీజిల్ వాహనాలను స్వచ్ఛందంగా తరలించి తుక్కుగా మార్చే వారికి ప్రోత్సాహకాలను ఇవ్వడంపై సూచనలు సమర్పించ వలసిందిగా కూడా ట్రిబ్యునల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే విధంగా నగరంలో రిజిష్టరయ్యే వాహనాల సంఖ్యపై పరిమితి విధించడం గురించి ట్రిబ్యునల్ ప్రభుత్వ సూచనలను కోరింది. వాహనాలను రోడ్లపై పార్క్ చేయకుండా ఉండడం కోసం పార్కింగ్ సదుపాయాలను మెరుగుపరచాలని చెప్పింది. అంతే కాకుండా వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా పార్కింగ్ చార్జీలను నిర్ణయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
నగరంలో కాలుష్య స్థాయి ప్రమాద స్థితికి చేరిందని, రాజధాని వాసులకు మెరుగైన వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని ట్రిబ్యునల్ చెప్పింది. నగరంలోని కాలుష్యానికి డీజిల్ ప్రధాన కారణాలలో ఒకటని అభిప్రాయపడిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్.. పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలపై నిషేధం విధిస్తూ గత వారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వును అమలుచేయడంలో ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ విషయాన్నే ప్రభుత్వం తరపు న్యాయవాది జుబేదాబేగం సోమవారం ట్రిబ్యునల్‌కు వివరించారు. ట్రిబ్యునల్ ఉత్తర్వుల వల్ల నగరానికి కూరగాయలు సరఫరా చేసే, చెత్తను ఎత్తే వాహనాలు వ ంటి వాటిపై ప్రభావం పడుతుందని తెలిపారు.
తద్వారా నగరవాసుల నిత్యావసర సేవలకు ఇబ్బంది కలుగుతుందని ట్రిబ్యునల్ దృష్టికి తీసుకొచ్చారు. ఉత్తర్వులను అమలు చేయడానికి ప్రభుత్వానికి మరింత సమయం ఇవ్వాలని ఆమె కోరారు. దాంతో నిషేధాన్ని మెరుగ్గా ఎలా అమలు చేయవచ్చో మే 1 లోగా తెలియజేయాలని ప్రభుత్వాన్ని ట్రిబ్యునల్ కోరింది. నిషేధం అమలుకు శాస్త్రీయ ఆధారం కలిగిన సూచనలు ఇవ్వాలని, అంతవరకు పాత డీజిల్ వాహనాలను స్వాధీనం చేసుకోరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముం దుగా ఎలాంటి హెచ్చరిక లేకుండా ట్రిబ్యునల్ నిషేధం విధించిందని ఫిర్యాదు చేస్తున్న పాత డీజిల్ కారు యజమానులకు ట్రిబ్యునల్ ఇచ్చిన స్టే ఊరటనిచ్చింది. పాత వాహనాలపై నిషేధం విధిస్తే ఢిల్లీ దాని పరిసరాలలో ట్రక్కులు నడపబోమని ట్రక్కర్లు హెచ్చరించారు. ఢిల్లీలో పది లక్షల డీజిల్ వాహనాలుండగా 2.5 లక్షల వాహనాలు పదేళ్లు దాటినవని ఒక అంచనా.
డీజిల్ వాహనాలపై నిషేధం వాయిదా
Published Tue, Apr 14 2015 5:29 AM | Last Updated on Sun, Sep 3 2017 12:18 AM
Advertisement